మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై సతారా జిల్లా కరద్ ప్రాంతంలోని నారాయణ్గావ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులను రెజ్లర్లుగా గుర్తించారు. కొల్హాపూర్లో రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని అక్కడ నుంచి కారులో తిరిగి పుణేకు వస్తుండగా కరద్ వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మృతిచెందిన రెజ్లర్లు పుణే నగరంలోని కట్రాజ్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు చెప్పారు. మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన ఎనిమిది మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని పోలీసులు చెప్పారు. ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గుర్ని మెరుగైన వైద్యం కోసం సతారా జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించిన పోలీసులు.. శవపంచనామా తర్వాత వాటిని బంధువులకు అప్పగించనున్నారు.