జమ్మూ కశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం గమ్సార్ ప్రాంతంలో జరిగింది. మెరుపులతో కూడిన పిడుగుపాటుకు ఓ జంట, మరో వ్యక్తి మరణించినట్లు పూంచ్ జిల్లా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రమేష్ కుమార్ అంగ్రాల్ తెలిపారు.
మృతులను సూరన్కోట్లోని లాథోంగ్ గ్రామానికి చెందిన మహ్మద్దిన్ కుమారుడు మహ్మద్ హసీక్(38), అతని భార్య జరీనా కౌసర్(30), మరో వ్యక్తి జావేద్ అహ్మద్(38)గా పోలీసులు గుర్తించారు. వీరు పశువుల పెంపకం ద్వారా జీవనం సాగించే సంచార జాతికి చెందినవారని తెలిపారు. పిడుగుపాటుకు పెద్ద సంఖ్యలో జంతువులు కూడా మృత్యువాత పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.