తొమ్మిది రోజుల పాటు స్వామి వారి దర్శనం నిలిపివేత !

tirumala srivari darshan will close on 9 days

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తులకు షాక్‌ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17 వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రకటించారు. నేడు టీటీడీ ఆలయ అధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం ఆలయ చైర్మెన్‌ మాట్లాడుతూ ఆగస్టు 11న అంకురార్పణ ఉంటుందని, 12వ తేదీ నుంచి 16 తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో అష్ట బంధన బాలాలయ మహా సం‍ప్రోక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహాక్రతువు సందర్భంగా వైదిక కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడతారు. వైఖానస ఆగమ నిబంధనల మేరకు ఆ సమయంలో ఆలయ సిబ్బంది సైతం బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. గర్భాలయంలో మరమ్మతులనూ అర్చకులే చేస్తారు. కాబట్టి స్వామివారి దర్శనం పూర్తిగా నిలిపివేయనున్నారు. అయితే బయట వరకు ఈ సంప్రోక్షణలో దాదాపు 30 వేల మంది భక్తులకు అవకాశం కల్పిస్తామని చైర్మన్ తెలిపారు. ఆగస్టు 11న అంకురార్పణంతో ఈ వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వేణుగోపాలదీక్షితులు కంకణభట్టార్‌గా వ్యవహరిస్తారు. 40 మందికిపైగా ఋత్వికులు, దాదాపు 100 మంది వేద పండితులు, ప్రబంధ పండితులు, వేద విద్యార్థులు ఇందులో పాల్గొంటారు. ఆగస్టు 12న ‘కళాకర్షణ’ తరువాత సన్నిధి సిబ్బందిని కూడా రాములవారి మేడ దాటి అనుమతించరు. ఆగస్టు 15న మహాశాంతి తిరుమంజనం నిర్వహించి, ఆగస్టు 16 ఉదయం 10.16 గంటలకు తులా లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆగస్టు 17 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు 48 రోజులపాటు మండలాభిషేకం జరుగనుంది.

మహాసంప్రోక్షణ కార్యక్రమాల కోసం శ్రీవారి ఆలయం, ఇంజినీరింగ్‌, ఉద్యానవనం, విజిలెన్స్‌ తదితర విభాగాల ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. మహాసంప్రోక్షణలో భాగంగా శ్రీవారి మూలవిరాట్టు, ఇతర దేవతామూర్తుల శక్తిని బింబం నుంచి కుంభంలోకి ఆవాహనచేసి ఉపచారాలు, శాంతిహోమాలు నిర్వహిస్తారు. అష్టబంధనం అంటే ఎనిమిది రకాల వస్తువులతో తయారుచేసిన చూర్ణం.. దీని ఆయుర్దాయం 12 ఏళ్లు ఉంటుంది.. ఈ అష్టబంధనాన్ని శ్రీవారి పాదాల కింద ఉంచుతారు. ఈ తొమ్మిది రోజల పాటు కొండపైకి భక్తులను అనుమతించేది లేదని పుట్టా స్పష్టం చేశారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అధికారులపై మండిపడుతున్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం ఉండదు. గత కొంత కాలంగా టీటీడీలో చెలరేగుతున్న వరుస వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం అందరిలో ఆసక్తి రేకిత్తిస్తోంది. శ్రీవారి నగలు మాయం చేస్తున్నారంటూ మాజీ టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఘాటు విమర్శలు చేస్తున్న సమయంలో, తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తూ పాలక మండలి తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.