శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకు ఒకసారి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి జరగనుంది. ఆగస్టు 12 నుంచి 16 వరకు ఐదు రోజులపాటు ఈ క్రతువు సాగనుంది. ఈ సందర్భంగా శ్రీవారి దర్శనాన్ని ఐదు రోజుల పాటు పూర్తిగా నిలిపివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. జులై 24న జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని టీటీడీ వర్గాల సమాచారం. 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహాక్రతువు సందర్భంగా వైదిక కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడతారు. వైఖానస ఆగమ నిబంధనల మేరకు ఆ సమయంలో ఆలయ సిబ్బంది సైతం బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. గర్భాలయంలో మరమ్మతులనూ అర్చకులే చేస్తారు. కాబట్టి స్వామివారి దర్శనం పూర్తిగా నిలిపివేయనున్నారు.
అయితే, గతంలో ఆలయాన్ని గంటల తరబడి మూసివేసినా, పరిమిత సమయం పాటు భక్తులకు దర్శనాన్ని కల్పించేవారు. కానీ ఇక ఈ సంవత్సరం అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ సెలవుల్లో రావడంతో, భారీగా భక్తులు వస్తే వారు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో దర్శనాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేయాలని టీటీడీ భావిస్తోంది. ఈ మేరకు భక్తులు తిరుమలకు వచ్చి నిరాశతో వెళ్లే బదులు, ముందే అప్రమత్తం చేయాలని ఇప్పటి నుండే ప్రచారం మొదలు పెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ ఐదు రోజుల్లో ఎటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, ఆర్జిత సేవా టికెట్లనూ టీటీడీ జారీ చేయలేదు. ఈ విషయమై తుది నిర్ణయాన్ని 24వ తేదీన జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు. చివరిగా 2006లో ఈ క్రతువు జరిగగా ఈ ఏడాది ఆగస్ట్ 12 నుండి జరగాల్సి ఉంది.