భయంతో వణికిపోతున్న తిరుపతి ప్రజలు

భయంతో వణికిపోతున్న తిరుపతి ప్రజలు

ఎంఆర్‌ పల్లి, శ్రీకృష్ణా నగర్ పరిధిలో ఇళ్లు కుంగిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సుమారు 18 ఇళ్లకు బీటలు తీయడంతో ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. నిన్న ఈ ప్రాంతంలోనే ఇంటి వెనుక నీటి సంపు ఒరలు పైకి లేవడం.. దీనికి తోడు రాత్రి నుంచి ఇళ్లు బీటలు తీయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కాగా, తిరుపతి కార్పొరేషన్ 20వ డివిజన్ ఎం.ఆర్ పల్లి లోని శ్రీకృష్ణా నగర్‌లో ఓ మహిళ తన ఇంట్లోని 25 అడుగుల వాటర్‌ ట్యాంక్‌ని శుభ్రం చేస్తుండగా అది భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణానగర్‌లోని ఘటనను ఎస్వీ యూనివర్సిటీ జియాలజి ప్రొఫెసర్స్ బృందం పరిశీలించింది.

అనంతరం దీనిపై అసోసియేట్ ప్రొఫెసర్ మధు మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటన రాయలసీమ జిల్లాల్లో ఇదే తొలిసారి అని తెలిపారు. భూమి పొరలలో మార్పు, సంప్ నిర్మాణ సమయంలో నింపిన ఇసుక కాలువ గట్టున ఉన్న ప్రాంతం కావడం, వరద ముంపు.. ఇవన్నీ కలగలపిన అంశాల కారణంగానే సంపు 15అడుగులు పైకి లేచిందని తెలిపారు. అయితే దీని వల్ల భయపడాల్సిన పని లేదని, ఇది భూమిలో జరిగే సహజమైన పరిణామమేనని చెప్పారు.