టాలీవుడ్ లో పీఆర్వోల తెలియని వారు ఉండరు అప్పటి ఎన్టీఅర్ నుండి ఇప్పటి ఎన్టీఅర్ వరకూ ప్రతీ సినిమాకీ, ప్రతీ హీరోకీ ఓ పీఆర్ ఓ తప్పనిసరి. కొన్ని సంస్థలకు,కొందరు హీరోలకు శాశ్వత పీఆర్వోలు ఉండగా కొన్ని సంస్థలు, కొందరు హీరోలు మాత్రం సినిమాకు తగ్గట్టు మారుస్తూ ఉంటారు. ఈ పీఆర్వోలకు ఇప్పటి దాకా ఒక అసోసియేషన్ కానీ సరయిన ప్లానింగ్ లేకపోవడం వల్ల కొన్ని సార్లు ప్రెస్ మీట్లు క్లాష్ కావడం ఒక హీరో ప్రెస్ మీట్ కు అటెండ్ అవుతున్న మీడియా మరో హీరో ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు మిస్ కావడం లాంటివి తరచూ జరుగుతున్నాయి. అందుకే ఎటూ సినిమా ప్రమోషన్‌కి సంబంధించిన సమస్త వ్యవహారాలూ పీఆర్‌వోల చేతుల మీదుగానే నడుస్తున్నాయి కాబట్టి వారంతా ఇప్పుడు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారట.
హైదరాబాద్ ఎఫ్ ఎన్సిసి లో సుమారు 15 మంది పీఆర్వోలు మీటింగ్ లో పాల్గొన్నట్టు సమాచారం. పీఆర్ఓ ల తరపున ఓ యూనియన్ ఏర్పాటు చేయడమే ఈ మీటింగ్ ప్రధాన అజెండా అని తెలిసింది. తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల్లో పీఆర్ఓ యూనియన్లు ఉన్నాయి. కానీ టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ అలాంటి ప్రయత్నాలేం జరగలేదు. అందుకే ఓ యూనియన్ స్థాపించడానికే వారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాము ఎదురుకుంటున్న సమస్యలతో పాటు భవిష్యత్తులో ఎవరికైనా సమస్య వచ్చినపుడు దాన్ని సంఘం తరఫున ఎలా పోరాడాలి అనే దాని గురించి ఇందులో చర్చించినట్టు తెలిసింది. అంటే ఓ సంస్థ పీఆర్వో లను అర్థాంతరంగా తీసేసినా, డబ్బులు ఎగ్గొట్టినా, ఒకరి సినిమాల్ని మరొకరు లాక్కున్నా ఈ అసోసియేషన్ రంగంలోకి దిగుతుందని, పీఆర్ ఓ ల తరపున నిలబడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం మీడియాకీ పీఆర్వోలకు చిన్న పాటి గ్యాప్ మొదలైంది. ఆ గ్యాప్ ను ఎలా పూడ్చుకోవాలి అనే దాని మీద కాస్త లోతుగా చర్చించినట్టు టాక్. అధికారిక ప్రకటన అయితే రాలేదు కాబట్టి ఫైనల్ కంక్లుజన్ అనేది తెలియాల్సి ఉంది.