దొరికేశాడు: అమ్మాయిలపై లైంగిక వేధింపులు.. ఆపై షీ టీం ..

తెలంగాణలో ఆగంతుకుడిని పోలీసులు పట్టుకున్నారు. మహిళలు, యువతులను సోషల్ మీడియా ద్వారా అసభ్యకర మెసేజులు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్న సైకోను నల్గొండ షీ టీం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ మీడియాతో మట్లాడుతూ… కొన్ని కీలక విషయాలు వెల్లడించారు.

అయితే వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పార్శ అఖిల్ అలియాస్ చందు సికింద్రాబాద్ ప్రాంతంలోని అడ్డగుట్ట ఏరియాలోని హోమ్ కేర్ సెంటర్ లో వార్డ్ బాయ్ గా పని చేస్తున్నాడు. అక్కడే నివాసం ఉంటూ తనతో పనిచేసే నర్సుల ఫోన్ నెంబర్లు తెలుసుకోవడం మొదలెట్టాడు. దాంతో ఆగకుండా వారితో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని బెదిరించి వారి స్నేహితుల ఫోన్ నెంబర్లను సేకరించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

ఇలా దాదాపు 50 మందికి పైగా ఇతడి వేధింపులకు గురయ్యారని పోలీసులు వెల్లడించారు. దీంతో ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన యువతి వృత్తిరీత్యా హైదరాబాద్ లోని ఒక హోమ్ కేర్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తుంది. తాజాగా నల్గొండలో జమా మసీదులో నివాసం ఉంటున్న వృద్ధురాలైన రోగికి సేవలు చేసేందుకు ఇక్కడికి వచ్చింది. సదరు యువతిని చందు వాట్సాప్ ద్వారా పేరు చెప్పకుండా చాటింగ్ చేస్తూ వీడియో కాల్ లో బూతు బొమ్మలు పంపించాడని తెలిసింది. దీంతో విసుగు చెందిన యువతి నల్గొండ షీ టీం పోలీసులను సంప్రదించడంతో రంగంలోకి దిగిన పోలీసులు అఖిల్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ఇంటర్మీడియట్ చదివిన అఖిల్ అమ్మాయిలను హనీ ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకుని వేధించే వాడని విచారణలో నమ్మలేని నిజాలు వెలుగుచూస్తున్నాయి.