Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జమ్మూ కాశ్మీర్ లో నిత్యం చెలరేగుతున్న హింసలో భద్రతాదళాలు, ఆందోళనకారులే కాదు… సామాన్య ప్రజలూ సమిధలవుతున్నారు. కాశ్మీర్ లో స్థానికులతో పాటు… అక్కడి అందాలను ఆస్వాదిద్దామని వచ్చే టూరిస్టులకూ భద్రతలేదన్న విషయం మరోసారి స్పష్టమయింది. విహారయాత్రం కోసం కాశ్మీర్ వెళ్లిన తమిళనాడు యువకుడు తిరుమణి ఆందోళనకారులు జరిపిన రాళ్లదాడిలో మృతిచెందడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. 22 ఏళ్ల తిరుమణి తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తుండగా… శ్రీనగర్ లో ఆందోళనకారులు రాళ్లవర్షం కురిపించారు. ఈ ఘటనలో తిరుమణి తలకు రాళ్లు తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఆయన్ను సమీపంలోని స్కిమ్స్ ఆస్పత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మరణించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో తిరుమణి మరణించారని పోలీసులు తెలిపారు.
తిరుమణి కుటుంబంతో కలిసి గుల్మర్గ్ కు బయలుదేరారని, ఆ సమయంలో ఆందోళనకారులు రాళ్లురువ్వడంతో ఈ దారుణం జరిగిందని చెప్పారు. తిరుమణి ప్రయాణిస్తున్న కారుతో పాటు మరికొన్ని వాహనాలపై కూడా ఆందోళనకారులు రాళ్లురువ్వేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ దారుణం గురించి తెలుసుకున్న జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. తిరుమణి కుటుంబసభ్యులను కలిసి ఓదార్చారు. ఇది హృదయ విదారకఘటన అని, తన తల సిగ్గుతో చితికిపోయిందని, మృతుడి బంధువులను పరామర్శించిన అనంతరం మెహబూబా వ్యాఖ్యానించారు.
కాశ్మీర్ లో నిరంతరంగా సాగుతున్న హింస పేద యువకులు, భద్రతాదళాల ప్రాణాలను హరిస్తోందని, దీనికి చరమగీతం పాడడానికి ఒక మధ్యేమార్గాన్ని కనుగొనాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ దారుణంపై మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తంచేశారు. అతిథిగా వచ్చిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపామని, రాళ్లు విసిరేవాళ్లు ఇదేనా చేయాల్సింది అని ఆయన ప్రశ్నించారు. నిరసనకారులు ఏ పద్ధతి పాటిస్తున్నారని నిలదీసిన ఆయన నిజాన్ని తెలుసుకోవాలని కోరారు. ఈ తరహా రాళ్లదాడిలోనే ఓ యువతి గాయాలపాలయిందని, ఆమె త్వరగా కోలుకోవలని కోరుకుంటున్నానని ఒమర్ వ్యాఖ్యానించారు. అమాయకపౌరులపై నిరసనకారులు దాడికి దిగుతుండడంపై నేషనల్ కాన్ఫరెన్స్ శ్రీనగర్ లో శాంతిర్యాలీ చేపట్టింది. పార్టీ కార్యాలయం నుంచి టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.