విషాదంలో కాంగ్రెస్…మరో సీనియర్ నేత మృతి 

tragic-death-of-congress-another-senior-leader

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో, హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆయనను చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1959 జూలై 1వ తేదీన జన్మించిన ముఖేష్ గౌడ్ కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గతంలో మహారాజ్ గంజ్, గోషామహల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009-14 మధ్య కాలంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పని చేశారు.

2014, 2019లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు. టీడీపీ నేత దేవేందర్ గౌడ్‌కు ఆయన సమీప బంధువు. అయితే ఒక పక్క కాంగ్రెస్ దిగ్గజం జైపాల్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ముఖేష్ గౌడ్ మరణ వార్త అందడంతో, రాజకీయ నేతలు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.

ఆయన మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యే ముఖేశ్ గౌడ్ చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ముఖేశ్ గౌడ్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖేశ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.