న్యూఢిల్లీ నుంచి దిబ్రూగఢ్, అగర్తల, హౌరా, పట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రా బాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడగావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావి స్టేషన్లను కలుపుతూ ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. తదుపరి మరిన్ని కొత్త మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు తెలిపింది. కరోనా కేర్ సెంటర్లుగా ఇప్పటికే 20 వేల కోచ్‌లను భారతీయ రైల్వే వినియోగిస్తోంది. అలాగే రోజుకు 300 వరకు రైళ్లను వలస కూలీల కోసం ప్రత్యేకంగా శ్రామిక్ ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో నడుపుతోంది. ఇవిపోను అందుబాటులో ఉన్న రైళ్లను తదుపరి మరిన్ని కొత్త మార్గాల్లో నడపనున్నట్టు తెలిపింది.
సోమవారం సాయంత్రం 4 గంటలకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా బుకింగ్ ప్రారంభించనున్నట్టు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లు ఉండవని, ప్లాట్‌ఫాం టికెట్ కోసం కూడా కౌంటర్లు ఉండవని తెలిపింది. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే స్టేషన్లోకి అనుమతించనున్నట్టు తెలిపింది. ప్రయాణికులు ముఖాన్ని కవర్ చేసుకోవాలని, రైలు ఎక్కేటప్పుడు స్క్రీనింగ్‌కు వెళ్లాల్సి ఉంటుందని, కరోనా లక్షణాల్లేని వారినే రైలులోకి అనుమతించనున్నామని తెలిపింది. రైలు షెడ్యూలు, తదుపరి వివరాలను మరో ప్రకటన ద్వారా తెలియపరచనున్నట్టు వెల్లడించింది.
స్క్రీనింగ్, నిమిత్తం ప్రయాణికులు గంట ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. రైళ్లలో మునుపటి మాదిరిగా దుప్పట్లు అందించరు. నిబంధనలకు అనుగుణంగానే ఏసీ సదుపాయం. తాజా గాలినే గరిష్టంగా వినియోగించుకునేలా ఏర్పాటు.ఈ రైళ్లలో ప్రయాణించే వారు ఆరోగ్యసేతు యాప్‌ను తప్పక ఇన్స్టాల్ చేసుకోవాలి.తాజాగా నడిచే రైళ్లలో సూపర్‌ఫాస్ట్ రైలు చార్జీలను వసూలు చేస్తారు. చార్జీల్లో రాయితీలుండవు.
ప్రతి బోగీలో 72 మందికి బదులుగా 54 మందినే అనుమతిస్తారు.