ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనలో తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు వైఎస్ జగన్. సీఎంగా ప్రమాణం చేసిన రోజు నుంచి పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లను కీలక పదవుల నుంచి తప్పించి వారి స్థానంలో వేరేవారిని నియమించిన ఆయన రెండు రోజుల కిందట కూడా భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టి ఇక ఇప్పుడు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో నిరీక్షణ జాబితాలో ఉన్న ఏఆర్ అనూరాధ, జి పాలరాజు, విక్రాంత్ పాటిల్‌కు పోస్టింగ్ ఇచ్చారు. అనూరాధను రాష్ట్ర అగ్నిమాపక విభాగం డైరెక్టర్ జనరల్‌గా, పాలరాజును సాంకేతిక సేవలు విభాగంలో డీఐజీగా, పాటిల్‌ను రైల్వే ఎస్పీగా నియమించారు. ఇక, విశాఖ నగర పోలీసు కమిషనర్‌గా రాజీవ్‌కుమార్ మీనా, గుంటూరు రేంజి ఐజీగా వినీత్ బ్రిజ్‌లాల్, విశాఖపట్నం రేంజి డీఐజీగా లేళ్ల కాళిదాస్ వెంకట రంగారావులను నియమించారు. జూన్ 5న బదిలీల్లో పోస్టింగ్ పొందిన డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్‌లను పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. అగ్నిమాక శాఖ డీజీగా ఉన్న కె సత్యనారాయణకు పీటీవో ఐజీగా, ఈ ప్రగతి సీఈవోగా ఉన్న బాలసుబ్రమణ్యంను సాధారణ పరిపాలన శాఖకు, విశాఖ నగర కమిషనర్‌గా ఉన్న మహేశ్‌చంద్ర లడ్డాను ఐజీ (పర్సనల్)గా నియమించడం విశేషం. మరి కొందరికి రైల్వే, ఆర్థిక నేరాలు, ఏపీఎస్పీ బెటాలియన్, నిఘా విభాగాలు తదితర చోట్ల ఐజీ, డీఐజీ, ఎస్పీలుగా నియమించారు.