Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తాగునీటి వాటాలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ కు 16 టీఎంసీలు, తెలంగాణకు ఆరు టీఎంసీల నీటిని కేటాయిస్తూ త్రిసభ్య కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపుపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్ లోని జలసౌధలో సమావేశమైంది. బోర్డు కార్యదర్శి సమీర్ చటర్జీ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ తో పాటు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది తమకు 40.1 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించాలని తెలంగాణ, తక్షణమే 17 టీఎంసీలు విడుదల చేయాలన్న ఏపీ విజ్ఞప్తులపై సమావేశంలో చర్చించారు. ప్రాజెక్టుల వద్ద కనీస నీటివినియోగ మట్టాలు ఉండేలా చూడాలని, బోర్డు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. నిబంధనలకు విరుద్దంగా , బోర్డు అనుమతి లేకుండా, ఉమ్మడి జలాశయాల నుంచి నీరు విడుదల చేయవద్దని సమీర్ ఛటర్జీ రెండు రాష్ట్రాలను ఆదేశించారు. అన్ని అంశాలను వచ్చే నెలలో జరిగే పూర్తి స్థాయి బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.