ప‌శ్చిమ‌బెంగాల్ లో బీజేపీ దుస్థితి ఇదీ…

TMC win West Bengal Panchayat Elections without Contest

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేశమంతా కాషాయ‌జెండాను రెప‌రెప‌లాడించాల‌ని క‌ల‌లు కంటున్న బీజేపీకి ప‌శ్చిమ‌బెంగాల్ మాత్రం కొర‌క‌రాని కొయ్య‌గానే మిగిలిపోతోంది. తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నిక‌లు మరోసారి బీజేపీకి షాకిచ్చాయి. ప‌శ్చిమ‌బెంగాల్ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లోని 20వేల వార్డుల‌ను తృణ‌మూల్ కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా గెలుచుకుని… రాష్ట్రంలో పాగా వేయాల‌న్న బీజేపీ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. ఈ వార్డుల్లో క‌నీసం పోటీ చేసేందుకు కూడా విప‌క్ష పార్టీల‌కు అభ్య‌ర్థులు లేని ప‌రిస్థితి నెల‌కొంది. మొత్తం 3,358 గ్రామ పంచాయితీల్లో 48,650 స్థానాలుండ‌గా… 16,814 స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయ‌ని, 341పంచాయితీ స‌మితిల్లోని 9,217 స్థానాల్లో 3,059 స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. జిల్లా ప‌రిషత్తుల్లోనూ తృణ‌మూల్ హ‌వా సాగించింది. 20 జిల్లా ప‌రిష‌త్ ల‌లో 825 స్థానాలుండ‌గా… 203 స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయి. మిగిలిన స్థానాల‌కు ఈ నెల 14న ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది.

ఈ ఫ‌లితాల‌పై బీజేపీ త‌న‌దైన వాద‌న వినిపించింది. ఎన్నిక‌ల్లో పోటీచేయాల‌ని భావించిన వారిని తృణ‌మూల్ కాంగ్రెస్ భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసింద‌ని, రాష్ట్ర బీజేపీనేత దిలీప్ ఘోష్ ఆరోపించారు. తృణ‌మూల్ బెదిరింపుల‌వ‌ల్లే క్షేత్ర‌స్థాయి ఎన్నిక‌ల్లో పోటీప‌డేందుకు త‌మ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ముందుకు రాలేద‌ని అన్నారు. చాలాప్రాంతాల్లో నామినేష‌న్లు వేసిన త‌మ పార్టీవారిని బెదిరించి విత్ డ్రా చేయించుకునేలా చూశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. మొత్తానికి ఈ ఎన్నిక‌ల తీరు గ‌మ‌నిస్తే… సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ పశ్చిమ‌బెంగాల్ లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకునే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో వామ‌ప‌క్ష పార్టీ నేత‌లు కూడా తృణ‌మూల్ కాంగ్రెస్ వైపు మ‌ళ్ల‌డంతో కేంద్రంపై నిరంత‌రం పోరాటంచేస్తున్న మ‌మ‌తాబెనర్జీ సొంత రాష్ట్రంలో మ‌రింత బ‌లప‌డ‌డ్డార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నావేస్తున్నారు.