త్రివిక్రమ్‌ చాలా ఫీల్‌ అయ్యాడట!

Trivikram Serious on Aravinda Sametha Still Leaked

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ రాయలసీమ వాసిగా కనిపించబోతున్నాడు. ఇక ఎన్టీఆర్‌ పాత్ర గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది. తాజాగా ఎన్టీఆర్‌ తండ్రి రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ అని, ప్యాక్షనిజంకు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ పోరాడే వ్యక్తి అంటూ ఒక కథ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ విషయం గురించి చర్చ జరుగుతున్న సమయంలోనే షూటింగ్‌ స్పాట్‌ నుండి మానిటర్‌లోని ఒక స్టిల్‌ లీక్‌ అయ్యింది. డైరెక్టర్‌ మానిటర్‌ను ఎవరో ఫొటో తీయడంతో సదరు ఫొటో లీక్‌ అయ్యింది. అది కాస్త వైరల్‌ అవ్వడంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, నాగబాబులు తండ్రి కొడుకులు అనే విషయం రివీల్‌ అయ్యింది. సినిమాలోని ఆసక్తికర ఎలిమెంట్‌ లీక్‌ అవ్వడంతో దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సినిమాకు సంబంధించిన స్టిల్‌ గతంలో కూడా ఒకటి లీక్‌ అయ్యింది, అప్పుడు లైట్‌ తీసుకున్నప్పటికి దర్శకుడు ఇప్పుడు ఏమాత్రం దీన్ని అంగీకరించలేక పోతున్నాడు. తాను ఎంతగా ప్రయత్నించినా కూడా ఇలా జరుగుతుండటంతో దర్శకుడు త్రివిక్రమ్‌ సెట్స్‌లోకి మొబైల్స్‌ను అనుమతించబోవడం లేదు అంటూ ప్రకటించాడట. ఇకపై ఎవరైనా మొబైల్‌ చేతిలో పట్టుకుంటే సెట్స్‌ నుండి బయటకు పంపించేస్తాం అంటూ ప్రకటించాడట. ఇకపై అయినా లీక్‌ కాకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రొడక్షన్‌ టీంను సీరియస్‌గానే త్రివిక్రమ్‌ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. మరో ముఖ్య పాత్రలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటిస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.