తెలంగాణలో ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో రాచకొండ పోలీసులు వివాదంలో చిక్కుకున్నారు. అధికార పార్టీకి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారని, ప్రచారం కూడా చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లే పోలీసు వాహనానికి టీఆర్ఎస్ జెండా కట్టిన ఫొటో సోషల్‌మీడియాలో హల్‌చెల్ చేస్తుంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ కి చెందిన ఓ వాహనానికి టీఆర్ఎస్ పార్టీ జెండాలు కట్టి ఉన్నాయి. అది మీడియా కంట పడటంతో ఫోటో వైరల్ గా మారింది. టీఆర్ఎస్ కి పోలీసులు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. కాగా దీనిపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పందించారు. కొంతమంది కావాలని, పనిగట్టుకొని సోషల్ మీడియాలో పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్నారని, అది మంచి పద్దతి కాదని తెలిపారు.పోలీసులు ప్రజల రక్షణకు, శాంతి భద్రతల పరిరక్షణకు పనిచేస్తున్నారని, పార్టీలకోసం కాదని స్పష్టం చేశారు.
ఈ నెల 23న ఉప్పల్ ప్రాంతంలో మంత్రి కేటీఆర్ సభకు పెట్రోలింగ్ కి వాహనం వెళ్లిందని, రోడ్డుపక్కన కారును ఆపి సిబ్బంది లా అండ్ ఆర్డర్ పనిలో నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రచారానికి వచ్చిన ఒక వ్యక్తి కావాలని అక్కడే ఉన్న పోలీస్ వాహనానికి టీఆర్‌ఎస్ జెండాను కట్టి తన ఫోన్‌లో ఫొటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో అప్‌లోడ్ చేశాడు. వెంటనే ఆ జెండాను తొలగించినట్లు కూడా ఆయన తెలిపారు. ఫొటోను దగ్గరగా పరిశీలిస్తే మనకు విషయం అర్థమవుతుందన్నారు. ఇలా కావాలని పోలీసులను టార్గెట్ చేసి ఒక పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుష్ప్రచారం చేయడం సబబు కాదని పేర్కొన్నారు. పోలీసు వాహనానికి జెండా కట్టింది ఎవరో, ఆ ఫోటోని సోషల్ మీడియాలో ఎవరు షేర్ చేశారో తదితర విషయాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. నిందితులను పట్టుకొని, పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన వివరించారు. వాహనానికి జెండా కట్టిన సమయంలో డ్రైవర్ అక్కడ లేకపోవడంతో ఈ తప్పిదం జరిగిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. టి తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆపాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ప్రజలను వేడుకున్నారు.