జర్నలిస్టుగా సుపరిచితుడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత విధేయుుడు.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. గడిచిన కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన.. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణ వార్త నియోజకవర్గ ప్రజల్లోనే కాదు.. టీఆర్ఎస్ అధినాయకత్వానికి షాకింగ్ గా మారింది.
దుబ్బాక నియోజకవర్గంలో గడిచిన నాలుగు దఫాలుగా గెలుస్తూ వస్తున్న రామలింగారెడ్డి మరణం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జీర్ణించుకోలేనిదిగా మారుతుందని చెబుతున్నారు. ఎమ్మెల్యే హఠాన్మరణం.. పలువురికి షాకింగ్ గా మారింది. రామలింగారెడ్డి సొంతూరు దుబ్బాక మండలం చిట్టాపూర్. ఆయన భార్య సుజాత.. కుమారుడు.. కుమార్తె ఉన్నారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లోకి రాక మునుపు.. రామలింగారెడ్డి వివిధ వార్తా పత్రికల్లో పని చేశారు. జర్నలిస్టు నాయకుడిగా ఆయన పలు రాష్ట్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. నక్సల్ ఉద్యమంలోనూ పాల్గొని.. పోలీసుల నిర్బందాన్ని ఎదుర్కొన్నారు.
పాత్రికేయుల వర్గానికి సంబంధించి బలమైన నేతగా చెప్పుకునే సోలిపేట.. ఊహించని విధంగా మరణించటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెపోటుతో హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో కన్నుమూసిన వైనం గురువారం తెల్లవారుజామున రెండుగంటల ప్రాంతంలో ఆయన మరణ సమాచారం బయటకు వచ్చింది.