కేసీఆర్ ది ఫెడరల్ ఫ్రంట్ కాదా ? జాతీయ పార్టీనా ?

KCR Makes Son TRS Working President To Focus On National Politics

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన వెంట‌నే కేసీఆర్ దృష్టి జాతీయ రాజ‌కీయాల‌పై మ‌ళ్లినట్టుంది. రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కంటే జాతీయ స్థాయిలో కొత్త ప్ర‌త్యామ్నాయ నిర్మాణం గురించే ఆయ‌న నిన్నటి ప్రెస్ మీట్ లో ప్ర‌ముఖంగా మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ కేసీఆర్ చెప్పింది ఏంటంటే ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్‌. అంటే, కాంగ్రెసేత‌ర‌, భాజ‌పాయేత‌ర పార్టీల‌ను ఒక‌టి చేసే ఒక కూట‌మి అనే అర్ధంలో మాట్లాడారు. అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అదే ప్రయత్నం చేసారు పలు రాష్ట్రాల నేతలను కలిసి కానీ నిన్న మీడియా ప్రతినిధులు అడిగే సరికి ఓ నాలుగు పార్టీల‌ను ద‌గ్గ‌ర‌కి చేయాల‌న్న‌ది త‌న ఆలోచ‌న కాద‌ని. ఒక్క మాట‌లో చెప్పాలంటే రాజ‌కీయాల్లో మార్పులు తీసుకురావాల‌న్న కేసీఆర్‌, బీజేపీ,కాంగ్రెస్ ముక్త భార‌త్ రావాల‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే దేశ రాజ‌కీయాల్లో మ‌రింత వేగాన్ని పెంచుతాన‌న్నారు. దేశంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్ర‌క‌టించారు.త్వరలోనే ఒక జాతీయ పార్టీ రాబోతోందన్న కేసీఆర్‌, ప్రాంతీయ పార్టీలతో కలిసి ఆ జాతీయ పార్టీ రాబోతోందన్నారు.బీజేపీ ముక్త్‌ భారత్‌, కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ రావాలని కేసీఆర్ చెప్పారు. తమది నాలుగు పార్టీలను కలిపే కూటమి కాదని, తాము దేశ రాజకీయాన్ని, దేశ ప్రజలనే ఏకం చేయబోతున్నామంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. త్వరలోనే తమ అజెండా ఒక రూపానికి వస్తుందని కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్ ది ఫెడరల్ ఫ్రంట్ కాదా ? జాతీయ పార్టీనా ? - Telugu Bullet

ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ‌న‌తా పార్టీ ఉదాహ‌ర‌ణ తీసుకొచ్చారు. అప్పట్లో, దేశంలో ఎమ‌ర్జెన్సీ త‌రువాత కొద్దికాలంలోనే ఓ నాలుగు పార్టీల‌ను ఏకం చేసింది. అదే ప‌ద్ధ‌తితో తాను చేస్తాన‌న్న‌ట్టుగా కేసీఆర్‌ మాట్లాడారు. అయితే, కేసీఆర్ చెప్పిన జ‌న‌తా పార్టీ ఉదాహ‌ర‌ణగా తీసుకుంటే త‌రువాతి కాలంలో అది ముక్క‌లైపోయిన ప‌రిస్థితి ఉంది. ఆ త‌రువాత‌, వీపీ సింగ్ హ‌యాంలో కూడా ఇలాంటి ప్ర‌య‌త్నం ఒక‌టి జ‌రిగింది. కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన సింగ్ కొన్ని పార్టీల‌ను అప్పుడు ఏకం చేయ‌గ‌లిగారు. ఆ స‌మ‌యంలో టీడీపీ కూడా మ‌ద్ద‌తుగా నిలిచింది. కానీ, పూర్తిగా క‌ల‌వ‌లేదు. అయితే, అలా ఏర్ప‌డ్డ జ‌న‌తా ద‌ళ్ కూడా త‌రువాతి కాలంలో పూర్తిగా ప్రాభవం కోల్పోయింది. గ‌తానుభ‌వాలు చూసుకుంటే ఇలాంటి ప్ర‌యోగాలకు ఎక్కువ కాలం మ‌నుగ‌డ లేదు. గ‌తంలో రెండు సార్లు జ‌రిగిన ప్ర‌య‌త్నాల‌లో లోపాల‌ను గుర్తెరిగి, ఒక కొత్త పంధాతో ముందకు వెళితే ఆ ప‌రిస్థితి గ‌తానికి భిన్నంగా ఉంటుందేమో మ‌రి. అయితే, ఇక్క‌డ కేసీఆర్ చెబుతున్న ప్ర‌త్యామ్నాయ ఏర్పాటుకు కూడా కేవ‌లం కొన్ని నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. లోక్ స‌భ ఎన్నిక‌లు కూడా ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి. రాబోయే మూడు లేదా నాలుగు నెల‌ల్లోనే జాతీయ రాజ‌కీయాల‌కు సంబంధించిన పునాది ఏర్ప‌డాలి. ఇక‌, ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తే కేంద్రంలో భాజ‌పా, కాంగ్రెస్ ల కొన్ని పార్టీలు మ‌ద్ద‌తుగా ఉంటూ రెండు కూట‌ములు ఇప్ప‌టికే ఉన్నాయి. దేశంలో ప్రముఖంగా ఉన్న, లేదా ఉండాలనుకుంటున్న చాలా పార్టీలూ అటో ఇటో ఉన్నాయి. ఎన్డీయే, యూపీయేల‌కు ప్ర‌స్తుతానికి దూరంగా ఉంటున్న పార్టీలు కొద్ది మాత్ర‌మే ఉన్నాయి. అవి కూడా ఈ రెంటికీ ప్ర‌త్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నాయి అనీ పూర్తిగా చెప్పలేం. ఈ రెండు కూట‌ముల నుంచి వ‌చ్చే ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్లు కోసం ఎదురుచూస్తున్న‌వారే అన‌డం కూడా కొంత‌వ‌ర‌కూ క‌రెక్టే అవుతుంది. ఇలాంటి ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు, ఈ స్వ‌ల్ప కాలంలో కేసీఆర్ చెబుతున్న మూడో ప్ర‌త్యామ్నాయ ఏర్పాటుకు ఇప్ప‌టికిప్పుడు సుముఖత ఎన్ని పార్టీలు వ్య‌క్తం చేస్తాయి? అనేది ప్రశ్నార్ధకం.