కేసీఆర్ ఆటలో పావుగా మారిన మధుసూధనాచారి !

TS EX Speaker Is In Troubles

తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, త‌న వెంట మోడీ ఉన్నాడని భావించే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈరోజు పెద్ద షాక్ త‌గిలింది. ఇక ముగిసిపోయింది అనుకున్న పాత కేసులో హైకోర్టు కేసీఆర్‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చింది. గ‌త టెర్ములో అసెంబ్లీలో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న ఆధారంగా విప‌క్ష కాంగ్రెస్ నేత‌లు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, సంప‌త్‌కుమార్‌ల‌ను అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందేగా. ఆ కేసులో ఈరోజు హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ శాసనసభ, న్యాయశాఖ కార్యదర్శులను హైకోర్టు అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ రిజిస్ట్రార్‌కు అప్పగించింది. అనంతరం రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించి ఇద్దరూ విడుదలయ్యారు. వీరితోపాటు నాటి స్పీకర్ మధుసూదనాచారి ప్రాథమికంగా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని అభిప్రాయపడిన హైకోర్టు, ఆయననూ ప్రతివాదిగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ చ‌రిత్ర‌లో ఇంత పెద్ద తీర్పులు ఇవ్వ‌డం ఇదే ప్ర‌థ‌మం అంటున్నారు. నోటీసులు జారీచేసినా స్పందించలేదంటూ అప్పటి డీజీపీ, నల్గొండ, గద్వాల జిల్లాల ఎస్పీలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదంటూ ఫాం-1 నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, తదుపరి విచారణకు వీరందరూ హాజరవుతారని భావిస్తున్నట్లు పేర్కొన్న హైకోర్టు, ఈ మొత్తం వ్యవహారాన్ని ఆర్టికల్- 136 కింద సుప్రీంకోర్టుకు నివేదిస్తామని హెచ్చరించింది. శాసనసభ నుంచి తమ బహిష్కరణ చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే.

ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి విచారించిన జస్టిస్‌ బి.శివశంకరరావు కీలక ఆదేశాలు జారీచేశారు. గత వారం జారీ అయిన వారెంట్లను అమలు చేశామంటూ పోలీసు కమిషనర్‌ ఇచ్చిన నివేదికను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకు సమర్పించారు. స్పీకర్‌ మధుసూదనాచారి తమ ఉత్తర్వులను అమలు చేయకపోగా కోర్టు నోటీసులను తిరస్కరించడం ద్వారా ధిక్కరణకు పాల్పడ్డారన్న నిర్ణయానికి వచ్చినట్లు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో మధుసూదనాచారిని 6వ ప్రతివాదిగా చేర్చుతూ ఆదేశాలు జారీ చేశారు. ఆయనతోపాటు డీజీపీ, ఎస్పీలకు నోటీసులు జారీ చేస్తున్నట్టు జడ్జ్ పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేశారు. ఓ వైపు ఎన్నికల్లో ఓటమి ఆయనను బాధిస్తూండగా.. కొత్తగా కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి రావడం.. ఆయనను మరిత ఇబ్బంది పెడుతోంది. కేసీఆర్ పొలిటికల్ గేమ్‌లో ఇరుక్కుపోయిన మధుసూదనాచారి కోర్టు బోనులో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.