ఆయిల్ ట్యాంకర్, ట్రక్ డ్రైవర్లు ఎట్టకేలకు సమ్మె విరమించారు. వారి సమ్మె విరమణతో పెట్రోల్ బంకులు తెరుచుకున్నాయి. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద సాధారణ పరిస్థితి నెలకొంది. ఆయిల్ ట్యాంకర్లు ఆలస్యంగా రావడంతో 10 శాతం పెట్రోల్ బంకులు మూసివేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం కల్లా పూర్తిస్థాయిలో పెట్రోల్ బంకులు అందుబాటులోకి వస్తాయని సదరు యాజమాన్యాలు తెలిపాయి. బంకులు తెరుచుకోవడంతో ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న వాహనదారులతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రద్దీని క్లియర్ చేసే పనిలో పడ్డారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే న్యాయ సంహిత రోడ్ యాక్సిడెంట్ బిల్లును వెనక్కి తీసుకోవాలని రవాణా సంఘాల నాయకులలో బేషరతుగా చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని ఆయిల్ ట్యాంకర్ల ఆపరేటర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఆయిల్ ట్యాంకర్లు సమ్మె చేస్తున్నాయని తెలియగానే మంగళవారం రోజున వాహనదారులు పుల్ ట్యాంక్ చేయించుకునేందుకు బంకుల వద్ద బారులు తీరగా ట్రాఫిక్ భారీగా స్థంభించింది. అర్ధరాత్రి వరకు బంకుల్లో ఇంధనం అయిపోయే వరకు వాహనదారుుల క్యూ కట్టారు. ఇంధనం అయిపోగానే బంకులు మూసివేశారు. ఎట్టకేలకు ఇవాళ సమ్మె విరమణతో మళ్లీ బంకులు తెరుచుకుంటున్నాయి.