TS Politics: నేటి నుంచి BRS లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ సమావేశాలు

TS Politics: BRS Lok Sabha election action meetings from today
TS Politics: BRS Lok Sabha election action meetings from today

నేటి నుంచి బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ షురూ కానుంది. ఈరోజు నుంచి తెలంగాణ భవన్ వేదికగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవ రావు, మాజీ సభాపతి మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్‌ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి తదితర నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు.

నేటి నుంచి ఈనెల12వ తేదీ వరకు తొలి విడతగా రోజుకు ఒక లోక్‌ సభ నియోజకవర్గం చొప్పున సమావేశాలు జరుగుతాయి. సంక్రాంతి తర్వాత 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండో దఫా సమావేశాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గంతో సన్నాహక సమావేశాలు ప్రారంభం కానుండగా ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులని ఆహ్వానించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సన్నాహక భేటీలో చర్చిస్తారు. ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకొని పటిష్టమైన కార్యాచరణ రూపొందించనున్నారు. సన్నాహక సమావేశాల అనంతరం, క్షేత్రస్థాయిలో ప్రచార పర్వాన్ని బీఆర్ఎస్ చేపట్టనుంది.