వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్ లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వైద్యుల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలో మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల్లో ఇంకా ప్రారంభం కాని వాటి వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కొడంగల్ లో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరపాలని అధికారులకు సూచించారు.
బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అన్నారు. ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దీంతో ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు. ఎయిమ్స్ ను సందర్శించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్రమంత్రిని కలిసి వివరిస్తానని సీఎం అన్నారు.