ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక రాయితీలు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కొన్ని చిన్న, మధ్య తరగతి ఐటి కంపెనీలు, యానిమేషన్, గేమింగ్, విక్స్ఎఫ్ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని వెల్లడించారు. డా, అంబేద్కర్ సచివాలయంలోని డిప్యూటి సీఎం కార్యాలయంలో ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖలు రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు.
ఈసందర్భంగా సంబంధిత అధికారులు ఆశాఖల పనితీరు విధానం గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఈ వార్షిక సంవత్సరంలో చేపట్టే కార్యాకలపాలకు కావాల్సిన నిధుల గురించి నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటి సీఎం మాట్లాడుతూ తెలంగాణలో పరిశ్రమల వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో డ్రై పోర్టుల ఏర్పాటుల పై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులను ఎగుమతులు పెంచుకోవడానికి డ్రై పోర్టుల ఆవశ్యకత ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పరిశ్రమల భూ కేటాయింపులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం రైతుల నుంచి సేకరిస్తున్న భూమికి పరిహారం సముచితంగా ఇస్తామన్నారు. లిడ్ క్యాప్ ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, దీనిని పునరుద్ధరణకు ఇందిరమ్మ రాజ్యం చర్యలు తీసుకుంటుందన్నారు.