వైఎస్సార్టీపీ పార్టీ విలీనాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని కొంతకాలంగా ఊగాహానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందిన షర్మిల అన్ని విషయాలపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని అన్నారు. తనతో కలిసి నడుస్తానన్న ఏపీ ఎమ్మెల్యే ఆర్కేకు ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో అత్యవసర భేటీ నిర్వహించిన షర్మిల భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు బుధవారం రాత్రి షర్మిల దిల్లీ వెళ్లనున్నారు. అయితే దిల్లీలోనే పార్టీ విలీనం, కాంగ్రెస్‌లో చేరిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
మరోవైపు వైఎస్ షర్మిలకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని వైఎస్సార్టీపీ కార్యదర్శి తూడి దేవేందర్ రెడ్డి తెలిపారు. షర్మిల ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరతారని వెల్లడించారు. పార్టీ నేతలకూ కీలక పోస్టులు వస్తాయని షర్మిల హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో సమావేశం తర్వాత షర్మిల ఇడుపులపాయకు బయల్దేరి వెళ్లారు. వైఎస్ ఘాట్ వద్దకు కుటుంబ సమేతంగా వెళ్లనున్న షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ ఘాట్ వద్ద ఉంచనున్నారు.