సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే, రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ తూంకుంట నర్సారెడ్డి రాజకీయ కదలికలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొన్నాళ్లుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. నర్సారెడ్డి పార్టీ మార్పు ప్రచారానికి మాత్రం తెరపడలేదు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం టీఆర్ఎస్ అధిష్టానం నర్సారెడ్డిపై వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న కారణంతో ఆయన్ను పార్టీ నుంచి తొలగించింది. మరోవైపు నర్సారెడ్డి సైతం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఓ లేఖను విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నానని అందులో తెలిపారు. రోడ్ల అభివృద్ది ఛైర్మన్ పదవిలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజలకు న్యాయం చేయలేకపోయానని అందులో వెల్లడించారు.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసిన నర్సారెడ్డి అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ ఆయనకు తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించింది. కాగా గత కొద్దిరోజులుగా కేసీఆర్‌పై నర్సారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లో చేరిక సమయంలో ఎమ్మెల్సీ ఇస్తానంటూ ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోకపోవడమే నర్సారెడ్డి అసంతృప్తికి కారణంగా సమాచారం. మరోవైపు ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్యం బారిన పడిన తనను పరామర్శించేందుకు కూడా కేసీఆర్‌కు సమయం లేకుండా పోయిందని నర్సారెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అలాగే రాజీనామా లేఖలో వేరే కారణాలు వెల్లడించినప్పటికీ.. తనకు ఇస్తానన్న ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతోనే నర్సారెడ్డి పార్టీని వీడినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో నర్సారెడ్డితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి చర్చలు జరుపుతున్నారు. అలాగే ఉత్తమ్ కూడా నర్సారెడ్డితో మంతనాలు నిర్వహించారు. దీంతో నర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిన్న సాయంత్రమే తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌కు నర్సారెడ్డి లేఖను పంపించారు. ప్రస్తుతం గజ్వేల్ నియోజవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, పలువురు టీఆర్ఎస్ ముఖ్యనేతలతో కలిసి రాహుల్ నివాసానికి చేరుకున్న నర్సారెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. నర్సారెడ్డికి మెదక్ అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.