సంక్రాంతికి పండుగకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్సు చార్జీల్లో ఎలాంటి పెంపులేదన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం TSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 7 వ తేది నుంచి 15 వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
దీనిపై సజ్జనర్ మాట్లాడుతూ.. మహా లక్ష్మి స్కీం అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన MGBS, JBS, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, LB నగర్ క్రాస్ రోడ్స్, KPHB, బోయిన్పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరూ డీవీఎం ర్యాంక్ అధికారులను ఇంచార్జ్ లుగా నియమించామని, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారని వివరించారు. ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోందని, ఏపీకి షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి పండుగకు బస్సు చార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, గతంలో మాదిరిగానే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీస్లను నడుపుతున్నట్లు తెలిపారు.