Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కు సునామీ హెచ్చరికల సంస్థ ఇన్ కాయిస్ హెచ్చరికలు జారీచేసింది. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, ప్రచండమైన గాలుల కారణంగా భారత తూర్పు తీరంలోని సముద్రంలో భారీ అలలు ఎగిసి పడే ప్రమాదముందని తెలిపింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 26వ తేదీవరకు ఇలా భారీ అలలు ఎగిసిపడే సూచనలున్నాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు భారత తూర్పుతీరంలోని తమిళనాడు, ఒడిశా, పశ్చిమబంగ తీరప్రాంతాల్లోని సముద్రం అల్లకల్లోలంగా మారిందని హెచ్చరించింది. 3-4మీటర్లు ఎత్తున ఉండే బలమైన అలలు హఠాత్తుగా ఎగిసిపడతాయని, తీరప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు అలలు చొచ్చుకువచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. తీరానికి దగ్గరగా నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఈ రెండురోజుల పాటు సముద్రస్నానాలు నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని తీరప్రాంతాల జిల్లాల యంత్రాంగానికి హెచ్చరికలతో కూడిన సూచనలు ఇచ్చింది. అదేసమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టంచేసింది. ఏపీలోని ఉత్తరకోస్తా జిల్లాలతో పాటు ఒడిశా, పశ్చిమబంగపై అలల ఉధృతి ఎక్కువ ప్రభావంచూసే అవకాశముందని, ప్రస్తుతం అండమాన్ వైపు నుంచి భారత ప్రధాన భూభాగం వైపుకు ప్రచండ అలలు దూసుకువస్తున్నాయని ఇన్ కాయిస్ వెల్లడించింది. ఆఫ్రికా సమీపంలో ప్రచండమైన గాలుల తీవ్రత కారణంగా సముద్రంలో భారీ అలలు ఏర్పడ్డాయని, ఇప్పటికే అలలు పశ్చిమ తీరంలోని చాలా ప్రాంతాలను తాకాయని, తెలిపింది. అరేబియా సముద్రంలోని తీర ప్రాంతాల్లో 4-5 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న అలల కారణంగా కేరళ, మహారాష్ట్ర, కర్నాటక తీరాల్లో పలు లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చిందని ఇన్ కాయిస్ తెలియజేసింది.