ఈ మధ్య కాలంలో తెలుగు సినీ, టెలివిజన్ ఇండస్ట్రీలలో ఆత్మహత్యలు ఎక్కువయిపోయాయి. కొద్ది నెలల క్రితం వీ6 యాంకర్ రాధిక ఆత్మహత్యకు పాల్పడగా ఇప్పుడు తాజాగా ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసిన తేజశ్విని నిన్న రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలోని ఫ్లాట్ నంబర్ 105లో గత కొంత కాలంగా దంపతులు మట్టపల్లి తేజశ్విని, పవన్‌కుమార్ నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితమే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తేజశ్విని ఓ చానల్లో న్యూస్ రీడర్‌గా పనిచేసేది. భర్త పవన్‌కుమార్ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తేజశ్విని అత్త అన్నపూర్ణాదేవితో గొడవ పడింది. అనంతరం ఇంట్లోని వారు ఉంటున్న గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.
ఎంతకీ తేజశ్విని రాకపోవడంతో అనుమానం వచ్చిన అత్త గది వద్దకు వెళ్లి చూసింది. ఉరేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటి కిటికీలో నుంచి చూడగా గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గుర్తించారు. తలుపులు పగలకొట్టి లోనికి వెళ్లిన పోలీసులు తేజస్విని మృతి చెందినట్లు నిర్ధారించుకుని వివరాలు సేకరించారు. తేజస్విని స్నేహితురాలి ద్వారా గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అర్థరాత్రి సమయంలో వారు ఈడుపుగల్లు చేరుకున్నారు. వారి సమక్షంలో తేజస్విని మృతదేహాన్ని కిందికిదించి పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. . 174వ సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.