Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ …ఈ రెంటిలో పవన్ ఏ పాత్రలో వున్నా తిట్టడమే పనిగా పెట్టుకున్న కత్తి మహేష్ కి పిలిచి పీట వేసి కూర్చోబెట్టి ఓ రెండు నెలలపాటు టీవీ 9 చేసిన రచ్చకు ఈ వారంలోనే శుభం కార్డు పడింది. అయితే ఆ ఎపిసోడ్ చూసిన వారికి పవన్ ని కత్తి మహేష్ ఎందుకు టార్గెట్ చేశారో అర్ధం అయ్యింది కానీ కత్తికి టీవీ 9 అంత ప్రాధాన్యం ఇస్తోందో అర్ధం కాలేదు. ఒక్క టీఆర్ఫీ కోసమే టీవీ 9 ఈ పని చేసిందని అనుకోడానికి వీల్లేదు. లోపల ఏదో గుట్టు దాగి ఉంటుందన్న అనుమానం చాలా మందికి వచ్చింది. ఆ గుట్టు బయటకు రాకపోయినా ఓ వర్గంలో పవన్ కి వ్యతిరేకంగా టీవీ 9 పని చేస్తుందన్న అభిప్రాయం బలపడింది. ఆ ఎఫెక్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇలాంటి విషయాలను పసిగట్టడంలో చురుగ్గా వుండే టీవీ 9 బృందం వెంటనే విరుగుడు మంత్రం ప్రయోగిస్తోంది.
జనసేన అధినేత మీద హఠాత్తుగా ప్రేమ పెంచుకుంది. అనంతపురం పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ పాల్గొన్న కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించింది. ఇందుకు కారణం పవన్ ఫాన్స్ ని మళ్లీ దగ్గర చేసుకోవడమే అని వేరే చెప్పక్కర్లేదు. టీవీ 9 తాజా వ్యూహం చూస్తే పక్కా రాజకీయ తత్వం కనిపిస్తోంది. సగటు రాజకీయ నాయకులు చాలా మంది ప్రజల విజ్ఞతను, జ్ఞాపకశక్తిని తక్కువ అంచనా వేస్తారు. ఆ క్రమంలో కొన్ని సార్లు సక్సెస్ అవుతారు. మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతారు. ఇప్పుడు టీవీ 9 వ్యవహారశైలి చూస్తే కూడా అదే వ్యవహారం గుర్తొస్తోంది. నిన్నమొన్నటిదాకా పవన్ ని అనరాని మాటలు అనిపించి ఇప్పుడు ప్రేమ ప్రదర్శించినా నమ్మాల్సిన వాళ్ళు నమ్మితేనే ఏ వేషం వేసినా ఫలితం ఉంటుంది. లేకుంటే వేషంగానే మిగిలిపోతుంది.