ఆ ఇంట్లో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టడం తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు. వారిద్దరూ కలిసి మెలిసి, ఎంతో ప్రేమగా ఉండేవారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఒకే చోట పెరిగిన వీరు.. జీవితాంతం ఇంతే ప్రేమగా కలిసి ఉండాలని భావించారు. కానీ ఇంతలో వీరికి పెళ్లి వయస్సు రావడంతో తల్లిదండ్రలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. దీంతో సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.
అయితే, పెళ్లి జరిగితే తాము విడిపోతామనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన కన్నీరు పెట్టిస్తోంది. వివరాలు.. కర్ణాటక మండ్య జిల్లా శ్రీరంగపట్నం మండలం, హనసనహళ్లి గ్రామానికి చెందిన సురేష్, యశోద దంపతులకు దీపిక, దివ్య అనే ఇద్దరు కవల పిల్లలున్నారు. వారికి పెళ్లి వయస్సు రావడంతో తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. అయితే, ఒకే కుటుంబానికి చెందిన సంబంధాలు లభించలేదు.
ఈక్రమంలో వేర్వేరు కుటుంబాలను చెందిన వారికి ఇచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. వివాహమైతే తామిద్దరం ఒకేచోట ఉండలేం, విడిపోతామని మనస్తాపానికి గురైన దీపిక, దివ్య.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తమ గదుల్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చివరికి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారు. కళకళలాడే తమ బిడ్డలు ఇల్లు చీకటి చేశారని మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై అరికేర్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నారు.