Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు రాజకీయాలే రసవత్తరం అనుకుంటే అంతకుమించిన డ్రామా జయలలిత మేనకోడలు ఇంట్లో జరుగుతోంది. జయ మరణం తర్వాత ఆమె మేనకోడలు దీప బయట ప్రపంచానికి తెలిసింది. అప్పటిదాకా మౌనంగా వున్న ఆమె ఒక్కసారిగా శశికళ ని టార్గెట్ చేస్తూ అన్నాడీఎంకే రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూసారు. అయితే అది వల్ల కాకపోవడంతో సొంత పార్టీ ఏర్పాటు చేశారు. జయ పోలికలతో వున్న ఈమె తమిళ రాజకీయాల్లో రాణిస్తుందా లేదా అని ఆ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకునేలోపే ఆమెకి భర్త మాధవన్, సోదరుడు దీపక్ తో విభేదాలు వున్న విషయం బయటకు వచ్చింది. ఈ విషయాలు బయటకు వచ్చాక దీప క్రేజ్ తగ్గిపోయింది. కానీ దీప దంపతులు మేల్కోలేదు. ఇద్దరూ గొడవ పడుతూనే వున్నారు. ఓ సమయంలో దీప పెట్టిన పార్టీలో ఆమె కారు డ్రైవర్ పెత్తనం చేస్తున్నాడని , తనను ఆమె పక్కన పెట్టిందని ఆరోపిస్తూ ఆమె భర్త మాధవన్ మీడియాకి ఎక్కాడు.అదేమీ లేదని దీప వివరణ ఇవ్వడంతో ఆ ఎపిసోడ్ కి అక్కడితో ఫుల్ స్టాప్ పడింది.
హఠాత్తుగా ఓ వారం కిందట దీప ఇంటికి ఓ వ్యక్తి ఐటీ అధికారి అంటూ ఊడిపడ్డాడు. సోదాలు చేయాలంటూ హడావిడి చేసాడు. ఇటీ సోదాలు బృందంగా కాకుండా ఒక్కడే రావడంతో దీప ఇంట్లో వున్నవారికి డౌట్ వచ్చింది. వాళ్ళు ఐడీ కార్డు కోసం నిలదీయడంతో సదరు వ్యక్తి అక్కడ నుంచి జారుకున్నాడు. ఈ తతంగం నడిచిన సమయంలో దీప ఇంటిలో కూడా లేరు. తర్వాత ఆమె ఈ నకిలీ అధికారి గురించి పోలీస్ కేసు పెట్టింది.పోలీసుల విచారణ కొనసాగుతున్న సమయంలో ప్రభాకరన్ అనే వ్యక్తి దీప ఇంటికి వచ్చినట్టు తెలిసింది. పోలీసులకు లొంగిపోయిన సదరు ప్రభాకరన్ చెప్పిన మాటలు అందరికీ షాక్ ఇచ్చాయి. దీప ఇంటికి వెళ్లేలా తనను ప్రోద్భలం చేసింది ఆమె భర్త మాధవన్ అని పోలీస్ విచారణలో ప్రభాకరన్ చెప్పాడు. దంపతుల మధ్య విభేదాల నేపథ్యంలో మాధవన్ తన భార్యను భయపెట్టడానికి ఈ నాటకం ఆడినట్టు తెలుస్తోంది. మొత్తానికి జయ మేనకోడలు భర్త స్వయంగా ఇంటి దొంగ అని తేలిపోయింది.