ట్విట్టర్ సెన్షేషన్.. ఇక శాశ్వతంగా ఇంటి నుంచే పనులు

కరోనా వైరస్ తో అన్నీ కుదేలైనాయి. ఆర్ధికరంగం అన్ని దేశాలను పాతాళంలోకి నెట్టింది. కరోనా పంజా విసురుతోన్న ఈ సమయంలో.. నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో అన్నీ మూతపడ్డాయి. ఇదే, సమయంలో ప్రముఖ సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేసింది. ఫేస్‌బుక్, గూగుల్ కంపెనీల బాటలో ట్విట్టర్ కూడా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించింది.

అదేమంటే.. తాజాగా ట్విట్టర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తుండటంతో తమ కంపెనీ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. కరోనా సమయంలోనే కాదు.. ఆ తర్వాత కూడా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేసేలా కొత్త విధానాన్ని రూపొందించామని ట్విట్టర్ స్పష్టం చేసింది. కరోనా సమయంలో ఇంటి నుంచే పనిచేస్తున్న ఉద్యోగులు.. దీన్ని శాశ్వతంగా కొనసాగించాలని కోరడంతో.. అనుమతించినట్టు తెలిపింది ట్విట్టర్. అదేవిధంగా వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎక్కడి నుండైనా పని చేయగల ఉద్యోగులు ఉండడం వంటివి త్వరగా స్పందించడానికి ఉపయోగపడుతుందని అందుకే ఇంటి ఉంచే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నామని తెలిపింది.

అంతేకాకుండా ‘గత కొన్ని నెలలుగా మేం ఆ పని చేయగలమని నిరూపించాము. కాబట్టి.. మా ఉద్యోగులు ఇంటి నుండే పని చేయడానికి వీలు కల్పించే పరిస్థితులు ఉంటే ఎప్పటికీ అలా కొనసాగించాలని కోరారు. అందుకు తాము అంగీకారం తెలిపాం.’ అని వివరించారు. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చినప్పుడు తిరిగి తమ కార్యాలయాలను తెరుస్తాం.. తగు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటాము.. అలాగే… కార్యాలయాలు తెరవడం వరకు ఓకే.. కానీ, మా ఉద్యోగులు ఎప్పటి నుంచి తిరిగి ఆఫీసుకు వస్తారన్నది వాళ్ల నిర్ణయమే.. వాళ్లు ఎప్పుడు వచ్చినా సరే అంటూ వివరించారు. కాగా చాలా తక్కువ మినహాయింపులతో సెప్టెంబర్‌కి ముందు కార్యాలయాలు తెరిచే అవకాశం లేదని.. ఒకవేళ తెరిచినా అది మునపటిలా ఉండదని ట్విట్టర్ స్పష్టం చేసింది.