మరో పెళ్లికి అడ్డువస్తున్నాడని కన్నకొడుకునే హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అందుతున్న సమాచారం ప్రకారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడేనికి చెందిన చింతల కనకయ్యకు ఇప్పటికే రెండు సార్లు వివాహం జరిగింది. మూడో వివాహం చేసుకోవడానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడన్న కారణంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం గ్రామానికి చెందిన ఓ యువతితో కనకయ్యకు మొదట వివాహం జరిగింది. కుటుంబ గొడవల కారణంగా వివాహం జరిగిన ఆరు నెలలకే కనకయ్యతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లిన కనకయ్య హైదరాబాద్‌లోని దమ్మాయిగూడలో ఉంటూ రోజువారి కూలిపనులకు వెళ్లేవాడు.
ఈ క్రమంలో జనగామకు చెందిన స్వప్నతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కనకయ్య–స్వప్న దంపతులకు కుమార్తె, కుమారుడు అక్షయ్(4) ఉన్నారు. కొంతకాలంగా వీరు హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ సమీపంలోని అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటూ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు అధికం కావడంతో కొన్ని రోజులుగా భార్యభర్తలు దూరంగా ఉంటున్నారు. నెలన్నర క్రితం కనకయ్య బిడ్డను తల్లి దగ్గరే ఉంచి కొడుకు అక్షయ్‌ను తీసుకొని తిరుమలరాయినిగూడెంలో ఉంటున్న పెదనాన్న చింతల రాములు ఇంటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి భోజనం అనంతరం కనకయ్య అక్షయ్‌ను తనవద్దనే పడుకోబెట్టుకున్నాడు. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో కన్నకొడుకు అక్షయ్ ను మెడలు విరిచి హత్య చేశాడు. అనంతరం ఇంటి ముందు మంచంలోనే కొడుకు మృతదేహాన్ని ఉంచి గుట్టు చప్పుడు కాకుండా పరారయ్యాడు.
శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచిన చింతల రాములు కుటుంబీకులు మంచంలో నిర్జీవంగా పడి ఉన్న అక్షయ్‌ను దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చింది ఉండడంతో పోలీసులకు సమాచారమందించారు. నిందితుడు కనకయ్యపై ఐపీసీ–302 సెక్షన్ కింద హత్యానేరం కేసును నమోదు చేసినట్లు తెలిపారు.