దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం కాల్పులు కలకలం రేపాయి. ఖజురి ఖాస్ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేరగాళ్లు మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో నిందితుల మృతదేహాల వద్ద నుంచి ఆటోమేటిక్ పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లు, 15 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను అమీర్, రంజాన్‌లుగా గుర్తించారు.
ఇవాళ ఉదయం ఖజురి ఖాస్ ప్రాంతంలో ఇద్దరు నేరస్తులు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోtw పోలీసులను చూసిన నిందితులు మొదట కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నేరస్తులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన వారిని ఆసుప్రతికి తరలించగా, మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. కాగా, ఇవాళ ఉదయం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌తో దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఈ ఘటన అనంతరం ఢిల్లీలో భద్రతను మరింత కఠినం చేశారు.