ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీస్ సైరన్ ఇద్దరి ప్రాణాలను బలికొంది. లాక్ డౌన్ సమయంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ప్రభుత్వం పదేపదే చెప్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ… కొందరు ఆకతాయిలు మాత్రం ఏమాత్రం వినకుండా.. రోడ్లపై తిరుగుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు అక్కడక్కడా పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారు. పోలీసులు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ప్రజలు రోడ్డు మీదకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఆ భయమే ఇప్పుడు ఇద్దరి ప్రాణాలను బలికొంది. రోడ్డుపైకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులు వస్తున్నారన్న భయంతో పరిగెడుతుండగా గుండెపోటు వచ్చింది. వెంటనే కిందపడిపోయి ప్రాణాలు విడిచారు.
పశ్చి గోదావరి జిల్లాలోని చింతలపూడి మండలం వెంకటాపురానికి చెందిన పసుమర్తి భాస్కరరావు(55) ఇంట్లో నుంచి అలా రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో పోలీస్ సైరన్ వినిపించింది. కంగారుపడి వెంటనే పరిగెత్తేశాడు. గుండెజల్లుమంది.. ఆ వెంటనే గుండెపోటు వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. అది గమనించిన స్థానికులు వెంటనే భాస్కరరావును సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. పరిగెత్తే క్రమంలో గుండెపోటు వచ్చి చనిపోయినట్లుగా అంతా భావిస్తున్నారు. అలాంటి ఘటన పాలకొల్లులో మరొకటి చోటుచేసుకుంది. పాలకొల్లులోని లజపతిరాయ్పేటలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఎక్కువ మంది జనం గుమిగూడారు. ఆ సమయంలో పోలీసులు వస్తున్నట్టు సైరన్ రావడంతో వారికి దొరక్కుండా పారిపోయేందుకు అంతా తలా ఒత దిక్కు పారిపోయారు. అలా పరిగెడుతూ పట్టణానికి చెందిన వేండ్ర వీరాంజనేయులు (57) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది కూడా పోలీసులు కొడతారన్న భయంతో పరిగెడుతూ ఇద్దరూ మృత్యువాతపడడం స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.