ఒకవైపు కరోనా సంక్షోభం కొనసాగుతుండగానే క్రికెట్ టోర్నీలు ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ పర్యటనకు వెస్టిండీస్ వెళ్లింది. గత మంగళవారం ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన వెస్టిండీస్..మూడు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది. జూలై 8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా, వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌కు పాకిస్తాన్ పయనం కానుంది. అయితే ఇద్దరు పాక్ స్టార్ ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటనకు డుమ్మా కొట్టారు. వ్యక్తిగత కారణాలను చూపిన పేసర్ మొహ్మద్ అమిర్, బ్యాట్స్‌మన్ హారిస్ సొహైల్‌లు ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యారు. ఆగస్టు నెలలో అమిర్ భార్య ప్రసవించే సమయం. దాంతో తాను ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం కుదరదని పీసీబీకి విజ్ఞప్తి చేశాడు.
ఇక సొహైల్ కుటుంబంతో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో అతను కూడా ఆ పర్యటనకు సుముఖత వ్యక్తం చేయలేదు. కరోనా వైరస్ కారణంగా ఎవరైనా ఆటగాడు మహమ్మారి బారిన పడితే వేరే వాళ్లు అందుబాటులో ఉంచడం కోసం 28 మందిని ఇంగ్లండ్‌కు పంపించనుంది. అదే సమయంలో 14 మంది సపోర్టింగ్ స్టాఫ్‌ను ఇంగ్లండ్‌కు పంపించడానికి పీసీబీ సన్నద్ధమైంది. ఇదిలా ఉంచితే, ఈ నెల చివర్లో శ్రీలంక వేదికగా జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ను టీమిండియా రద్దు చేసుకుంది. ఇంకా కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో ఆ పర్యటనను రద్దు చేసుకుంది. శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళుతుందనే తొలుత వార్తలు వచ్చినా వాటిలో వాస్తవం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. భవిష్యత్తులో రద్దు చేసుకున్న టీ20 సిరీస్, వన్డే సిరీస్‌లను ఆడతామని బీసీసీఐ స్పష్టం చేసింది.