ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలకు స్వతంత్ర హోదా ప్రకటించిన రష్యా.. శాంతి స్థాపన పేరుతో ఆయా ప్రాంతాలకు తమ బలగాలను పంపుతోంది. దీంతో ఉక్రెయిన్ అప్రమత్తమయ్యింది. దేశంలోని రిజర్వ్ భద్రతా బలగాలను సిద్ధం చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. అయితే, బలగాలను మొత్తం రంగంలోకి దింపాల్సిన అవసరం ప్రస్తుతం లేదని ఆయన అన్నారు. ఈ మేరకు జాతినుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన జెలెన్స్కీ.. రిజర్వ్ బలగాలను సిద్ధం చేసినట్టు తెలిపారు.
‘‘ఉక్రెయిన్‌లోని మొత్తం బలగాలను మోహరించాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుత బలగాలకు మరికొంత మంది రిజర్వ్ స్టాఫ్‌ను జత చేయాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో జాతీయ అత్యవసర పరిస్థితి విధించనున్నట్టు ఆ దేశ భద్రతా విభాగం ఉన్నతస్థాయి అధికారులు వెల్లడించారు. రష్యా స్వతంత్ర హోదా కల్పించిన డొనెట్స్క్, లుహాన్స్క్లు సహా ఉక్రెయిన్ భూభాగమంతటా 30 రోజుల పాటు అత్యవసర పరిస్థితి అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత మరో 30 రోజులు దీనిని పొడిగిస్తామని తెలిపారు.
భద్రతా మండలి అధికారి ఒలెక్సీ డానిలోవ్ మాట్లాడుతూ.. బుధవారం తరువాత ఉక్రెయిన్ పార్లమెంటుకు ఒక నివేదికను అందజేస్తానని చెప్పారు. చట్టసభ సభ్యులు అదనపు భద్రతా చర్యలను ఆమోదించే అవకాశం ఉందని పేర్కొన్నారు.మరోవైపు, ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యాపై కఠినమైన అర్థిక ఆంక్షలను అమెరికా విధించింది.
రష్యాకు చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంక్‌పై ఆర్థిక ఆంక్షలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ సందర్భంగా రష్యాను కబ్జాదారుగా బైడెన్ అభివర్ణించారు. ‘‘సైనిక చర్య ద్వారా ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించాలని పుతిన్ చూస్తున్నట్లు నా అభిప్రాయం.. గతరాత్రి ఆయన ప్రసంగం వింటే ఇదే అనుమానం కలుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతల దృష్ట్యా జెనీవా వేదికగా రష్యా విదేశాంగ మంత్రితో జరగనున్న సమావేశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ రద్దు చేశారు. దౌత్యపరమైన అంశాలపై రష్యా సీరియస్‌గా లేదని అర్థమవుతోంది. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలను రద్దు చేస్తున్నట్లు బ్లింకెన్ తెలిపారు. మరోవైపు, కెనడా కూడా రష్యాపై ఆంక్షలు విధించింది. రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వందల మంది కెనడా సైనికులను తూర్పు ఐరోపాకు పంపుతున్నట్టు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు.
దక్షిణ బెలారస్‌లోని మోజర్ వద్ద ఉన్న చిన్న వైమానిక స్థావరంలో 100కిపైగా వాహనాలు, డజన్ల కొద్దీ సైనిక గుడారాలు ఉన్నట్టు శాటిలైట్లు గుర్తించాయి. ఈ వైమానిక స్థావరం ఉక్రెయిన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. పశ్చిమ రష్యాలోని పోచెప్ సమీపంలో అదనపు విస్తరణ కోసం ఓ ప్రాంతాన్ని చదును చేస్తున్నారు. బెల్గోరోడ్ పశ్చిమ శివార్లలోని మిలిటరీ స్థావరంలో కొత్త ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు.