ఉండవల్లి అఖిలపక్షం…ఎగ్గొడుతున్న వైసీపీ !

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన డిమాండ్లు ఊపందుకున్నాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు మోడీ ఒంటెత్తు సర్కారు సిద్ధమవుతోన్న తరుణంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తదితర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జనవరి 30న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే అంశంపై రెండుసార్లు నిర్వహించగా, ఇది మూడవ సారి. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై పోరాడే వివిధ సంఘాలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. మరోవైపు, ఇదే అంశంపై మంగళవారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ నేతృత్వంలో విజయవాడలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.

 

దీనికి టీడీపీ తరఫున మంత్రులు సోమిరెడ్డి, నక్కా ఆనంద్ బాబు, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు హాజరవుతున్నారు. ఈ భేటీకి హాజరుకాలేమని వైసీపీ ప్రకటించింది. టీడీపీతో కలసి ఒకే వేదికను పంచుకోలేమని తమకు వైసీపీ నాయకత్వం తెలిపిందని ఉండవల్లి తెలియజేశారు. మిగిలిన పార్టీలన్నీ హాజరుకానున్నాయని ఆయన తెలిపారు. హోదా కోసం ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్‌కు పిలపునివ్వగా దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు పలికారు. అలాగే గుంటూరులో ఆదివారం జరిగిన జనసేన శంఖారావంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు ఏకమై ఒకే గొంతుకను వినిపిద్దామని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. హోదా సాధన కోసం చివరి అస్త్రంగా గట్టిగా ఉద్యమిద్దామని, ఎన్నికల్లో విడివిడిగా పోటీచేద్దమంటూ అన్ని రాజకీయ పార్టీలను పవన్ ఆహ్వానించారు. దీంతో రానున్న రోజుల్లో హోదా, విభజన హామీల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.