Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తొలిసారి ప్రసంగించారు. సుదీర్ఘంగా సాగిన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను, భవిష్యత్ లక్ష్యాలను రాష్ట్రపతి వివరించారు. 2022 నాటికి దేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తవుతాయని, అప్పటికి అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి నూతన భారతంగా రూపాంతరం చెందుతుందని, నవ భారత స్వప్నాన్ని సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోవింద్ పిలుపునిచ్చారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నానన్నారు.
పేదలు, ఉన్నత వర్గాల మధ్య అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, రైతులకు ప్రభుత్వం అండగా ఉండి, వారి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయాలని సూచించారు. రైతుల అవసరాల కోసం ప్రవేశపెట్టిన ఇనామ్ పోర్టల్ కి మంచి ఆదరణ లభించిందని తెలిపారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో రైతుల గురించే ఎక్కువ సేపు మాట్లాడారు. అనంతరం ఆదివాసీలు, గ్రామీణులు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, మైనార్టీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ప్రయోజనాలు, వాటిలో సాధించిన విజయాల గురించి తెలియజేశారు.స్వయం సహాయక బృందాలను ప్రోత్సహిస్తూ దేశ అభివృద్ధిలో వారిని భాగస్వామ్యులను చేయాలని కోరారు. సమాజంలో చిట్టచివరి వ్యక్తిదాకా అభివృద్ధి ఫలాలు చేరాలన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గంలో కేంద్ర ప్రభుత్వం పయనిస్తోందన్నారు. పేదరికాన్ని నిర్మూలించి, ఆర్థిక అంతరాలు తగ్గించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తోందని కొనియాడారు.
ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించకపోతే రాజకీయ ప్రజాస్వామ్య అంతిమలక్ష్యం పూర్తికాదన్న బీఆర్ అంబేద్కర్ ఆశయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తోందని తెలిపారు. సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక స్వావలంబనకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున మరుగుదొడ్లు నిర్మించి స్త్రీల సామాజిక గౌరవాన్ని కాపాడుకున్నామని, ఇది కూడా సామాజిక న్యాయమే అని కోవింద్ వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ 150 వ జయంతి నాటికి భారత్ ను పరిపూర్ణ స్వచ్ఛ భారత్ గా మార్చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించుకుందన్నారు.
ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నామని చెప్పారు. గర్భం దాల్చే ఉద్యోగినులకు 26 వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు మంజూరుచేశామని, బేటీ బచావో, బేటీ పడావో వంటి కార్యక్రమాలతో బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా సుమారు రూ. 4లక్షల కోట్ల రుణాలు అందించామన్నారు. ప్రధానమంత్రి ఉజ్వలయోజన ద్వారా ప్రభుత్వం లక్షల సంఖ్యలో గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చిందని, తద్వారా మహిళలు కట్టెలు, బొగ్గులపై వంట చేసే బాధ తొలగించామని తెలిపారు. రామ్ నాథ్ కోవింద్ ప్రభుత్వ విజయాలను వివరిస్తుండగా..సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తంచేశారు.