Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కథువా సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా… ఈ దారుణం ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమయింది. పలు అంతర్జాతీయ పత్రికలు కథువా దారుణానికి సంబంధించిన వార్తలను ప్రముఖంగా ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కూడా స్పందించింది. ఎనిమిదేళ్ల చిన్నారికి మత్తు పదార్థాలు ఎక్కించి సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెను హత్య చేసిన ఘటనను అత్యంత భయంకరమైనదిగా ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ అభివర్ణించారు. భారత అధికారులు ఈ దారుణ ఘటనలో న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని గుటెరస్ తరపున ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ వ్యాఖ్యానించారు. బాలిక పట్ల పాశవికంగా ప్రవర్తించిన మృగాళ్లను శిక్షించాలని కోరారు.
అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు కథువా దారుణంపై ప్రధాని మోడీని ప్రశ్నించారు. కథువా, ఉన్నావ్ అత్యాచార దారుణాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని స్పందించి ఇలాంటి ఘటనలు దేశానికి సిగ్గుచేటని, నేరస్థులెవరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. మన పుత్రికలకు న్యాయం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. మోడీ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ న్యాయం ఎప్పుడు జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిగారూ… ఈ ఘటనలపై మౌనం వీడినందుకు ధన్యవాదాలు. మన పుత్రికలకు న్యాయం జరుగుతుంది అని చెప్పారు. అయితే ఆ న్యాయం ఎప్పుడు జరుగుతుందో యావత్ భారతదేశం తెలుసుకోవాలనుకుంటోంది అని రాహుల్ ట్వీట్ చేశారు.