Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దక్షిణాది రాష్ట్రాల్లో సినీ నటుల కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. అందుకే స్టార్లు ఇక్కడ ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలితను చూసి చాలా మంది స్టార్స్ పొలిటికల్ అవతారం ఎత్తారు. అయితే రాజకీయాల్లో వచ్చిన స్టార్స్ తో పోలిస్తే సక్సెస్ రేట్ చాలా తక్కువ. అయినా ఆ పరంపర కొనసాగుతూనే వుంది. తమిళనాట రజని, కమల్ ఇంకా పూర్తి స్థాయి రాజకీయాలు మొదలు కాక ముందే ఆ ఇద్దరికీ ఓ హెచ్చరిక లాంటి పరిణామం కర్ణాటకలో జరిగింది. అదే ఉపేంద్ర పార్టీ వ్యవహారం. ఖాకీ రంగు, ఆటో గుర్తుతో కిందటేడాది చివరిలో పార్టీ పెట్టిన ఆయన ఇంకా ఆరు నెలలు కూడా గడవక ముందే దాని మూసేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఉపేంద్ర చేసిన సినిమాలు చూస్తే మరీ ముఖ్యంగా ఆయన దర్శకత్వం చేసిన సినిమాలు చూస్తుంటే అదేదో రొటీన్ సినిమా అని ఎప్పుడూ అనిపించదు. అందుకే ఆయన రాజకీయ పెడతానని ముందుకు వచ్చినప్పుడు జనం ఏదేదో ఊహించుకున్నారు. కానీ ఆరునెలల్లోనే తట్టాబుట్టా సర్దుకోవడానికి కారణం అంతర్గత కలహాలు అని చెబుతున్నప్పటికీ అసలు విషయం ఆయనకు రాజకీయ ప్రక్రియ మీద పెద్దగా అవగాహన లేకపోవడం అని తెలుస్తోంది. పైగా పార్టీ ఏర్పాటు సమయంలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు భార్య, తమ్ముడిని ప్రమోట్ చేయాలని చూడడంతో కొత్త రాజకీయం చేద్దాం, చూద్దాం అని పార్టీలోకి వచ్చిన వాళ్ళు విబేధిస్తున్నారట. పైగా ఒంటరి పోరాటం చేస్తామని చెప్పిన ఉపేంద్ర ఇప్పుడు పార్టీ ని బీజేపీ లో కలపడానికి రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది. అదే జరిగితే వెండితెర మీద స్టార్ అయిన ఉపేంద్ర రాజకీయాల్లో మాత్రం తోక చుక్కగానే మిగిలిపోతారు.