Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెండు నెలల విరామం తర్వాత ఉత్తరకొరియా విధ్వంసక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి మళ్లీ దుందుడుకు చర్యలు ప్రారంభించడంతో అమెరికా, దక్షిణ కొరియా గట్టిగా బదులిస్తున్నాయి. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం జరిపిన కొన్ని నిమిషాల్లోనే దక్షిణ కొరియా కూడా ఓ క్షిపణి ప్రయోగించి ఆ దేశానికి షాకిచ్చింది. రాజధాని సియోల్ మీదగా ఈ పరీక్ష జరిగింది. ఉత్తరకొరియాకు దీటుగా సమాధానం చెప్పడానికే తాము క్షిపణిని ప్రయోగించామని దక్షిణ కొరియా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. నిజానికి అధ్యక్షుడు కిమ్ అనారోగ్యమో, లేక అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గడమో తెలియదు కానీ… వరుస క్షిపణి ప్రయోగాలను హఠాత్తుగా నిలిపివేసింది ఉత్తరకొరియా. దీంతో కిమ్ వెనక్కి తగ్గారని, అమెరికాకు, ఆదేశానికి మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు చల్లారినట్టేనని అంతా భావించారు. కానీ అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ట్రంప్ తన వైఖరితో మళ్లీ అలజడి రేపారు.
రెచ్చగొట్టే వైఖరితో ఉత్తరకొరియాను ఉగ్రదేశంగా ప్రకటించారు. దీంతో కిమ్ మళ్లీ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించి అమెరికాకు సవాల్ విసిరారు. దీనిపై అమెరికా తీవ్రంగా మండిపడింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు యుద్ధాన్ని కోరుకుంటున్నట్టు అనిపిస్తోందని, యుద్ధమే వస్తే సర్వనాశనం తప్పదని, ఆ దేశం నామరూపాల్లేకుండా పోతుందని కఠిన హెచ్చరికలు చేసింది. ఐక్యరాజ్యసమితి కౌన్సిల్ సమావేశంలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ ఈ హెచ్చరికలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయింది. కిమ్ ను నిలువరించేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నామని, వాటిల్లో భాగంగా సైనికచర్య గురించి కూడా ఆలోచిస్తున్నామని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు.
ఉత్తరకొరియా తక్షణమే తన దుందుడుకు వైఖరిని ఆపాలని లేదంటే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదముందని ఆమె హెచ్చరించారు. ఉత్తరకొరియాతో యుద్ధాన్ని తాము ఈ రోజు వరకు కోరుకోవడం లేదని, అయితే యుద్ధమే గనక వస్తే మాత్రం మరో తప్పు జరగకుండా ఆ దేశం సమూలంగా నాశనమవుతుందని ఆమె అన్నారు. చైనా తక్షణమే ఉత్తరకొరియాకు ముడిచమురు సరఫరాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అటు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, జపాన్ ప్రధాని షింజో అబేలతో ట్రంప్ అత్యవరసరంగా ఫోన్లో చర్చలు జరిపారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తోనూ దీని గురించి మాట్లాడమని ట్రంప్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందని కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అయితే ఉత్తరకొరియాను నియంత్రించడానికి అమెరికానే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రచారం చేస్తోందనే వాదనా వినిపిస్తోంది.