హుజూర్నగర్ ఉప ఎన్నికలో భార్యను గెలిపించుకోలేకపోయిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఆయన డిసైడయ్యారని.. ఈ రోజు దిల్లీలో అధిష్ఠానాన్ని కలిసి రాజీనామా సమర్పిస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ సిటింగ్ స్థానం.. అందునా డిసెంబరు నాటికి టీఆరెఎస్ హవాను తట్టుకుని స్వయంగా ఉత్తమ్ గెలిచిన స్థానంలో ఇప్పుడాయన భార్యనే గెలిపించుకోలేకపోవడం.. టీఆరెస్‌కు మునుపెన్నడూ లేని స్థాయిలో భారీ మెజారిటీ రావడం వంటివన్నీ కాంగ్రెస్ భవిష్యత్తుపై నీలినీడలు పరిచాయి. ఈ నేపథ్యంలో పార్టీని తాను ముందుకు నడిపించడం కష్టమేనని.. ఈ ఓటమిని అడ్డంపెట్టుకుని పార్టీలోని వైరి వర్గాలు నిత్యం ఇబ్బందులు కలిగిస్తాయని భావిస్తున్న ఆయన ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయానలుకుంటున్నట్లు తెలుస్తోంది.
నిజానికి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్‌తో మిగతా నేతలు కలిసి వచ్చారనే చెప్పాలి. తొలుత పద్మావతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినా ఆ తరువాత ఆమెకు టికెట్ ఖరారవడంతో రేవంత్ రెడ్డి వంటివారు కూడా ప్రచారం చేశారు. అయితే, ఉత్తమ్ ఓవర్ కాన్ఫిడెన్సుకు పోవడంతో ఓటమి తప్పలేదని అంటున్నారు. ఆర్టీసీ సమ్మె వంటివి టీఆరెస్ పట్ల వ్యతిరేకత తీసుకురావడంతో తమ గెలుపు నల్లేరుపై నడకేనని ఆయన భావించడంతో నష్టపోయారని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి.
పైగా ఈ ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా ప్రచారానికి రానప్పటికీ టీఆరెస్ నుంచి మంత్రులు, మరికొందరు కీలక నేతలను అక్కడే మోహరించింది. ఒక ఎన్నికలో నాయకులను ఎంతగా మోహరిస్తే నగదు ప్రవాహం, ప్రలోభాల పర్వం అంతగా ఉంటుందని అర్థం. కానీ.. ఈ విషయంలో ఉత్తమ్ జాగ్రత్త పడలేదు. టీఆరెస్ విపరీతంగా డబ్బు పంచినా… గ్రామస్థాయి నుంచి నాయకులతో మాట్లాడుతూ ఓట్లను కన్సాలిడేట్ చేసుకుంటున్నా ఏమీ చేయలేకపోయారు.
టీఆరెస్ సగటున రూ.1500 పంచితే కాంగ్రెస్ సగటున రూ.200కి మించి ఇవ్వలేదని అక్కడ గ్రౌండ్ టాక్. అలాంటి పరిస్థితిల్లో ఇలాంటి ఫలితాలే వస్తాయని కాంగ్రెస్ నేతల నుంచే విమర్శలొస్తున్నాయి. డబ్బులు, పోల్ మేనేజ్మెంట్ లేకుండా ఎన్నికలను గెలవలేమని హుజూర్ నగర్ ఉప ఎన్నిక నిరూపించింది.. ఒకే ఒక్క స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లోనే ఆ టాలెంట్ చూపించలేకపోయిన పీసీసీ అధ్యక్షుడు ఇక రాష్ట్రం మొత్తంలో ఎన్నికలు జరిగితే ఎలా డీల్ చేస్తారన్న ప్రశ్న రాకముందే పదవి నుంచి దిగిపోవాలన్న ఉద్దేశంతో ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.