ఇప్పటికీ అదే గ్లామర్‌తో ఉన్న లేడీ అమితాబ్‌

ఇప్పటికీ అదే గ్లామర్‌తో ఉన్న లేడీ అమితాబ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనిల్‌ సుంకరలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. దాదాపు 2 దశాబ్దాల తరువాత లేడీ అమితాబ్‌ విజయశాంతి ఈ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఇప్పటికే విజయశాంతి రీ ఎంట్రీపై భారీ హైప్‌ క్రియేట్‌ అవ్వటంతో చిత్రయూనిట్ కూడా ఆ అంచనాలను అందుకునే స్థాయిలో ఆమె క్యారెక్టర్‌ను తీర్చి దిద్దుతున్నారు. గతంలోనే ఆమె పాత్రకు సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్. తాజాగా దీపావళి కానుకగా విజయశాంతి లుక్‌ను రివీల్ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో విజయశాంతి ఇప్పటికీ అదే గ్లామర్‌తో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె భారతి పాత్రలో కనిపించనున్నారు.

రాయల్‌ లుక్‌లో ఉన్న విజయశాంతి ఫస్ట్ లుక్‌ కొద్ది నిమిషాల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నైన్టీస్‌లో స్టార్ హీరోయిన్‌గా గ్లామర్‌ రోల్స్‌తో పాటు లేడి ఓరియంటెడ్‌ సినిమాల్లోనూ నటించిన విజయశాంతి, తరువాత పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి సినిమాలకు దూరమయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆమె తరువాత యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు.

చాలా కాలంగా విజయశాంతి రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతో మంది దర్శకులు ఆమెతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చినా, విజయశాంతి మాత్రం రీఎంట్రీ పై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. ఇన్నేళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన ఇమేజ్‌కు తగ్గ పాత్ర దక్కటంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా తరువాత ఈ లేడీ సూపర్‌ స్టార్ తిరిగి వెండితెర మీద బిజీ అవ్వటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌.