Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి తీవ్ర అస్వస్తతతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎయిమ్స్ డైరెక్టర్ సహా డాక్టర్ల బృందం ఆయనకీ నిరంతరం చికిత్స అందిస్తున్నా ఆయన ఆరోగ్యం మరింత విషమించిందని తెలుస్తోంది. ఆయనకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్టు వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్నారని ఎయిమ్స్ మీడియా అధికారి చెప్పినప్పటికీ, వాస్తవానికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలుస్తోంది. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని మంగళవారం ఉదయం ఎయిమ్స్ మీడియా అధికారి ఆరతీ విజ్ బులెటిన్ విడుదల చేసినా మంగళవారం సాయంత్రం ఎయిమ్స్ నుంచి ఎటువంటి హెల్త్ బులెటిన్ విడుదల కాకపోవడం ఈ పరిస్థితికి ఊతమిస్తోంది.
వాజ్‌పేయికి ఉన్న ఏకైక కిడ్నీ, ఊపిరితిత్తులు అంతంత మాత్రంగా పనిచేస్తున్నాయని ఆసుపత్రి వర్గాల సమాచారం. అయితే ఈ విషయం మీడియాకి తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. కాగా, మంగళవారం మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అశ్విన్ కుమార్ చౌబే, సాధ్వీ నిరంజన్ జోషి, అనంత్ గీతే, మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి తదితరులు ఆసుపత్రికి వచ్చి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.