Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాస్టింగ్ కౌచ్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా… అన్ని సినీ పరిశ్రమల్లోనూ లైంగిక వేధింపులు, దాడులు కామన్ అన్న విషయం తెలిసిందే… అయినా దీనిపై ఇప్పుడు కొత్తగా చర్చ నడుస్తోంది. దీంతో అవకాశాల కోసం హీరోయిన్లు ఎదుర్కొనే దయనీయ పరిస్థితులు అందరికీ తెలుస్తున్నాయి. హాలీవుడ్ హీరోయిన్లు చాలామంది కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతున్నారు కానీ… భారతీయ హీరోయిన్లు పెద్దగా స్పందించడం లేదు. కొందరు టాలీవుడ్ హీరోయిన్లయితే… తమకు అసలు అలాంటి పరిస్థితే ఎదురుకాలేదని చెప్పుకొస్తున్నారు. నిజానికి అలాంటి పరిస్థితులు ఎదురయినప్పటికీ… చాలామంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడటానికి భయపడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇండస్ట్రీలో పరిస్థితులపై వ్యాఖ్యలు చేస్తే తదుపరి అవకాశాలపై ప్రభావం పడుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ తరుణంలో ఓ బాలీవుడ్ హీరోయిన్ మాత్రం తనకు ఎదురయిన చేదుఅనుభవాన్ని ధైర్యంగా మీడియాకు వివరించారు. స్వరభాస్కర్ అనే హీరోయిన్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె కరీనా కపూర్, సోనమ్ కపూర్ తో కలిసి వీరే ది వెడ్డింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన స్వర బాలీవుడ్ దర్శకుల తీరును పూసగుచ్చినట్టు వివరించారు. సినిమా షూటింగ్ లు జరిగే సెట్లలో ఫ్యూడల్ భావాలుంటాయి, కొందరు ఆదేశిస్తే… మిగతావారు వాటిని వినాల్సిందే. లైంగిక వేధింపుల విషయమూ ఇంతే. ఫలానాచోటికి వెళ్లాలంటే వెళ్లాల్సిందే. ఈ విషయంలో బాధితులు నోరుమెదపకుండా ఉంటారన్న సంగతి అక్కడున్న అందరికీ తెలుసు. ఈవ్ టీజింగ్ సర్వసాధారణం. నేను కెరీర్ తొలినాళ్లలో ఉన్నప్పుడు జరిగిన సంగతి ఇది.
ఓ చిత్రంలో నటించేందుకు 56రోజుల పాటు అవుట్ డోర్ లో ఉండాల్సి వచ్చింది. నాకు ఈ వాతారణమే కొత్త. చిత్ర దర్శకుడు డిన్నర్ కు రావాలని వేధించాడు. రోజంతా నటించడం లేదని తిడుతూ, రాత్రయ్యేసరికి రమ్మని పిలుస్తుండేవాడు. సినిమాలో సన్నివేశం గురించి చర్చించడానికి తన హోటల్ గదికి రమ్మని చెప్పేవాడు. అక్కడికి వెళ్తే మద్యం సేవించి ఉండేవాడు. షూటింగ్ మొదలయిన వారం రోజుల వ్యవధిలోనే ప్రేమ, సెక్స్ గురించి మాట్లాడేవాడు. ఓ రోజు రాత్రి తాగి నా గదికి వచ్చి కౌగిలించుకోమని అడిగాడు. నేను ఒంటరిగా ఉండడంతో చాలా భయపడ్డా. అప్పటినుంచి షూటింగ్ పూర్తయిన వెంటనే గదికి వెళ్లిపోయి లైట్స్ ఆపేసేదాన్ని. చీకటిలోనే మేకప్ తీసేదాన్ని. నేనునిద్రపోయా అనుకుని పిలిచేవాడు కాదు. ఆ తరువాత అతనికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కు విషయం చెప్పగా నాకు ఎస్కార్ట్ కల్పించారు. అని చెప్పారు స్వర భాస్కర్. ఆ దర్శకుడినే కాకుండా… తనను వేధించాలని చూసిన కొందరిని కూడా తాను ఎదరించానని, అందుకుగానూ కొన్ని అవకాశాలు కూడా కోల్పోయానని తెలిపారు. స్వరభాస్కర్ తరువాత అయినా… మరింతమంది హీరోయిన్లు తమపై జరిగిన దౌర్జన్యాలను బయటిప్రపంచానికి చెబుతారేమో చూడాలి.