Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో భారీ కమర్షియల్ సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు తేజ ఆ వెంటనే వెంకటేష్ హీరోగా ‘ఆట నాదే వేట నాదే’ అనే చిత్రాన్ని చేసేందుకు కమిట్ అయ్యాడు. అందుకోసం వెంకీ కూడా సిద్దం అవ్వడం జరిగింది. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం, త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభిస్తాం అనడం జరిగింది. అంతా ఓకే అనుకున్న సమయంలో తేజకు ‘ఎన్టీఆర్’ చిత్రానికి ఆఫర్ వచ్చింది. బాలకృష్ణ ఎంతో ఇష్టపడి చేస్తున్న సినిమా, ప్రతిష్టాత్మక చిత్రం అవ్వడంతో తేజ ఆ చిత్రంపైనే ఎక్కువ ఫోకస్ చేయాలని భావించాడు. అయితే ఏదో కారణం వల్ల తేజ ఆ చిత్రం నుండి తప్పుకున్నాడు. తేజ స్వయంగా తాను ఎన్టీఆర్ చిత్రానికి న్యాయం చేయలేను అంటూ చెప్పి తప్పుకోవడంతో చర్చనీయాంశం అయ్యింది.
‘ఎన్టీఆర్’ చిత్రం కోసం దర్శకుడు తేజ తన సినిమాను క్యాన్సిల్ చేసుకున్న సమయంలోనే వరుణ్ తేజ్‌తో కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని చేసేందుకు వెంకీ సిద్దం అయ్యాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అనీల్ రావిపూడి ‘ఎఫ్ 2’ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సమయంలోనే తేజ మళ్లీ వెంకటేష్‌ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. పక్కకు పెట్టిన ఆ ప్రాజెక్ట్‌ను మళ్లీ మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే మల్టీస్టారర్ పూర్తి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టేదాం అన్నట్లుగా సమాచారం అందుతుంది. దాంతో తేజ కనీసం అయిదు నెలల వరకు ఖాళీగా ఉండాల్సిందే. వెంకీ సరే అని తేజతో సినిమా చేస్తాడా లేదా అనేది చూడాలి.