Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్‌గా, ట్రెండ్ సెట్టర్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తేజ గత కొంత కాలంగా ఫామ్ లేక సతమతం అయ్యాడు. దాదాపు దశాబద్ద కాలం తర్వాత తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో సక్సెస్‌ను అందుకున్నాడు. రానా హీరోగా కాజల్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఆ సినిమా నిర్మాతకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. దాంతో చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమాకు ఎట్టకేలకు వెంకీ ఓకే చెప్పాడు. దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా వెంకటేష్‌తో ఒక కథను తేజ తెరకెక్కించాలని ఎదురు చూస్తున్నాడు. అయితే తేజ ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ఆయనతో సినిమా చేసేందుకు వెంకీ కాస్త వెనుకడుగు వేశాడు. తాజాగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం సక్సెస్ అయిన నేపథ్యంలో తేజపై నమ్మకంతో వెంకీ ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల 16న చిత్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో తేజ బిజీగా ఉన్నాడు. మరో వైపు నటీనటుల ఎంపిక కార్యక్రమం కూడా జరుగుతుంది. వీరిద్దరి కాంబో సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి ఉంది. తేజ ఖచ్చితంగా ఒక మంచి చిత్రాన్ని వెంకీకి అందిస్తాడనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. వచ్చే నెల 16న షూటింగ్ ప్రారంభించి ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్నారు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కేవలం మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలనే పట్టుదలతో తేజ ఉన్నట్లుగా తెలుస్తోంది.
త్వరలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఇటీవల తేజకు అప్పగించాడు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో పొలిటికల్ సీన్స్‌ను తేజ చక్కగా హ్యాండిల్ చేయడం జరిగింది. అందుకే తేజకు బాలయ్య ఈ ప్రాజెక్ట్ అప్పగించాడు. వచ్చే సంవత్సరంలో ఆరంభంలోనే సినిమాను పట్టాలెక్కించాలని తేజకు బాలయ్య సూచించడం జరిగింది. అందుకే వచ్చే నెల 16న వెంకీతో సినిమాను మొదలు పెట్టి జవవరి చివరి వరకు సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో తేజ ఉన్నాడు. మూడు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి వేసవిలో లేదా అంతకంటే ముందే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని కూడా చాలా తక్కువ సమయంలో తేజ పూర్తి చేయడం జరిగింది.