Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. రమణదీక్షితుల ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చుతుండగా..వైసీపీ ఆయనకు మద్దతు పలుకుతోంది. రమణదీక్షితులను తొలగించడం టీడీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం తమ తప్పు దిద్దుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై దృష్టిసారించాలని కోరారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా తిరుమల పరిణామాలపై స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి బహిరంగ లేఖ రాసిన ఐవైఆర్ రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై విచారణ అవసరమని, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోటు ప్రాంతంలో తవ్వకాలు జరిపే అధికారం ఎవ్వరికీ లేదని, పురావస్తు శాఖ తనిఖీకి, ఈ చర్యకు సంబంధం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ తవ్వకంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి వ్యవస్థ, ప్రభుత్వంలోని లోపాలను తెలిపే వ్యక్తులకు భద్రత కల్పించాలని ఐవైఆర్ సూచించారు. అటు రమణదీక్షితులు ఆరోపణలపై ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మండిపడ్డారు.
రమణదీక్షితులు ప్రచారం చేస్తున్నట్టుగా తిరుమల బొక్కసంలో కృష్ణదేవరాయలు సమర్పించిన నగలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని చెప్పుకొచ్చారు. ఆయన తన ఉనికిని కాపాడుకునేందుకే ముఖ్యమంత్రిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. వెయ్యికాళ్ల మండపం కూల్చివేత వెనక రమణ దీక్షితులు కూడా ఉన్నారని, ఆయన అంగీకారంతోనే మండపాన్ని కూల్చివేశారని వేణుగోపాల దీక్షితులు గుర్తుచేశారు. ఆ కట్టడానికి ఆలయంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. విధులకు సరిగ్గా హాజరుకాని రమణదీక్షితుల కుమారులకు నోటీసులు ఇచ్చిన తరువాతనే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారని ఆరోపించారు. గతంలో తనను సూర్యప్రభ వాహనం నుంచి బలవంతంగా నెట్టేసిన ఘనత ఆయనదని మండిపడ్డారు. బ్రాహ్మణ సంఘాల పేరిట విమర్శలు చేస్తున్న సౌందరరాజన్, పెద్దింటి రాంబాబు, ఆత్రేయబాబులకు టీటీడీతో సంబంధం ఏమిటని నిలదీశారు. తిరుమలలో ఉన్నది స్వామి కాదని, అమ్మవారని…చెబుతుంటే తామంతా తలూపాలా అని ఆయన ప్రశ్నించారు. పాతికేళ్లగా ఆలయ పరిధిలో ఏమి జరిగినా…అది రమణ దీక్షితులకు తెలిసే జరిగిందని, ఇప్పుడు తప్పులు ఎత్తిచూపుతున్నారంటే అది ఆయన చేసిన తప్పేనని వేణుగోపాల దీక్షితులు ఎద్దేవా చేశారు.