విజిల్ సినిమా రివ్యూ

విజిల్ సినిమా రివ్యూ

తమిళ స్టార్ హీరో విజయ్ ఇమేజ్ ప్ర‌స్తుతం త‌మిళ‌నాట ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వ‌ర‌స విజ‌యాల‌తో నెంబ‌ర్ వ‌న్  స్థానంపై కన్నేసాడు ఇళయ ద‌ళ‌ప‌తి. తాజాగా విజయ్.. అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘బిగిల్’ సినిమా చేసాడు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘తేరి‘ మెర్సల్’ సినిమాలు సెన్సేషనల్ క్రియేట్ చేసాయి. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘విజిల్’ సినిమా ప్రేక్షకులు అంచనాలు అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

రాజప్ప (విజయ్) రౌడీగా పేరు తెచ్చుకుంటాడు.. అతని కొడుకు మైఖెల్ అలియాస్ బిగిల్ (విజయ్) ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎలాగైనా నేషనల్స్ కు ఆడాలని అనుకుంటాడు. అయితే ఒకసారి సెలక్షన్స్ లో మైఖెల్ ఒక రౌడీ కొడుకని తెలిసి అతన్ని సెలెక్ట్ చేయరు. కొన్ని కారణాల వల్ల రాజప్ప మరణిస్తాడు.. మైఖెల్ కూడా తండ్రి బాటలో నడుస్తూ రౌడీయిజం నేర్చుకుంటాడు. ఇదిలాఉంటే ఒక సందర్భంలో అతను మళ్లీ మహిళా జట్టుకి కోచ్ గా వెళ్లాల్సి వస్తుంది. సెలక్షన్ ఆఫీసర్ జాకీ ష్రాఫ్ ఎప్పుడూ బిగిల్ ను అడ్డుకుంటూ ఉంటాడు. ఇంతకీ బిగిల్ తండ్రి కోరిక తీర్చాడా..? మహిళా జట్టు కోచ్ గా బిగిల్ ఏం సాధించాడు..? అన్నది సినిమా కథ.

విజయ్ ఎప్పటిలానే తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ కు ఈ సినిమా మరోసారి పండుగ వాతావరణం తెచ్చింది. సినిమాలో నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పొచ్చు. ఉన్నంతలో నయనతార పాత్ర ఆకట్టుకుంది. జాకీ ష్రాఫ్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మహిళా జట్టులో చేసిన ఆర్టిస్టులు అంతా బాగా చేశారు. సినిమా కోసం ఫుట్ బాల్ ప్రాక్టీస్ బాగా చేసినట్టు తెలుస్తుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.
జికే విష్ణు సినిమాటోగ్రఫీ బాగుంది.. కెమెరా వర్క్ సినిమాకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆశించిన స్థాయిలో లేదు. బిజిఎం ఓకే కాని పాటలు ఆకట్టుకోలేదు. కథ, కథనాల్లో దర్శకుడు అట్లీ రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా ఎడిటింగ్ కూడా అక్కడక్కడ ఇబ్బందిగా అనిపిస్తుంది. రన్ టైం కూడా ఒక మైనస్ అని చెప్పొచ్చు.
అట్లీ, విజయ్ సినిమా అంటే పక్కా హిట్ అన్న టాక్ ఉంది. అయితే విజయ్ స్టామినాకు ఓ మంచి కథ రాసుకుని తెరి, మెర్సల్ సినిమాలతో హిట్టు కొట్టాడు అట్లీ. అయితే బిగిల్ అదే విజిల్ విషయంలో లెక్క తప్పిందని చెప్పొచ్చు. విజయ్ ఇమేజ్ కు తగినట్టుగా కమర్షియాలిటీతో పాటుగా మంచి కథ చెప్పాలన్న ఆలోచన బాగుంది. కాని ఇలాంటి కథలు ఆల్రెడీ ఇదివరకు వచ్చాయన్న లాజిక్ మిస్సయ్యాడు అట్లీ.
కేవలం విజయ్ ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. కథనం కూడా చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా ఓకే అనేలా ఉన్నా చూస్తున్నంత సేపు కూడా కొత్తగా అనిపించదు. తమిళంలో విజయ్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఓకే కాని తెలుగులో మరోసారి విజయ్ విజిల్ వర్క్ అవుట్ కాలేదని చెప్పొచ్చు.
అయితే మహిళలకు స్పోర్ట్స్ లో వచ్చే సమస్యల మీద ఒక స్పెషల్ నోట్ గా ఈ సినిమా ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా ఇలాంటి అంశాన్ని టచ్ చేశారు. మొత్తానికి విజయ్ విజిల్ తెలుగు ఆడియెన్స్ కు నచ్చుతుందో లేదో కాని తమిళంలో మాత్రం ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి 2.75/5  రేటింగ్ ఇవ్వడం జరిగింది