బిచ్చగాడు సినిమాతో ఏ తెలుగు హీరోకి అంత త్వరగా దక్కని స్టార్ డమ్ ని దక్కించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ. సంగీత దర్శకుడిగా తమిళంలో ఒక వెలుగు వెలిగిన విజయ్ ఆంటోనీ ఆ తరువాత నిర్మాతగా మారి, తానే హీరోగా నటించిన నకిలీ (తమిళంలో నాన్) సినిమా తెలుగు లో విడుదలయ్యి కొంతవరకూ ఆకట్టుకుంది. ఆ తరువాత నటించి నిర్మించిన మరో చిత్రం డాక్టర్ సలీమ్ కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగులో విడుదలైన తన మూడవ చిత్రం బిచ్చగాడు తో కనీవినీ ఎరుగని ఘనవిజయం సాధించి, నిర్మాతలకు కోట్లలో లాభాలను తెచ్చిపెట్టింది. కానీ, ఆ తరువాత విజయ్ ఆంటోనీ నుండి వచ్చిన సినిమాలన్నీ తను నిర్మించినవే అయినా ఒక్క సినిమా కూడా విజయానికి నోచుకోలేదు.
నిన్ననే విడుదలైన విజయ్ ఆంటోనీ కొత్త సినిమా రోషగాడు సినిమా తమిళంలో మాంచి టాక్ తెచ్చుకున్నా, తెలుగులో మాత్రం సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన చాలా మందికి రోషగాడు సినిమా రిలీజ్ అయ్యిందన్న విషయం కూడా తెలియలేదు. ఈ కారణాల వలన, అటు నిర్మాతగా, ఇటు నటుడిగా, సంగీత దర్శకుడిగా మూడు పాత్రల్లో ఇమడలేకపోవడం వలన విజయ్ ఆంటోనీ ఇకనుండి సినిమా నిర్మాణం నుండి తప్పుకుంటున్నాడని తెలుస్తుంది. కారాణాలు ఏవైనా వరుస ప్లాపుల ఫలితంగా సినిమాలని నిర్మించి, విడుదల చేయడంలో ఏర్పడుతున్న అంతరాయాలు నుండి ఇకనైనా ఉపశమనం తెచ్చుకోవాలని భావిస్తున్నట్లుగా ఉంది విజయ్ ఆంటోనీ పరిస్థితి. రోషగాడు సినిమాకి పెట్టిన డబ్బులు తమిళంలో అయినా వెనక్కి తేగలిగితే, బయటి నిర్మాణసంస్థల నుండి అవకాశాలు రావొచ్చు. లేదంటే మళ్ళీ తన సినిమాలని తానే నిర్మించుకోవాలి ఈ విజయ్ ఆంటోనీ.